Share News

సాయం లేని సాగు..!

ABN , Publish Date - May 02 , 2024 | 01:04 AM

అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి వస్తే కృష్ణాడెల్టా ఆధునికీకరణ అని నమ్మించారు. కాల్వలకు కొత్తరూపు తెచ్చి, కౌలు రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు.. ఏనాడూ రైతులకు ఉపయోగపడే ఒక్క పనికి కూడా వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది లేదు. పంట నష్టపరిహారం నుంచి ధాన్యం బిల్లులు, మద్దతు ధర వరకూ, యంత్రాల నుంచి రుణాల వరకూ అన్నింటా అష్టకష్టాలకు గురిచేశారు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లోనూ రైతులను గాలికొదిలేశారు. ఫలితంగా బంగారు పంటలకు నిలయమైన కృష్ణాతీరంలో సాగు చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

సాయం లేని సాగు..!

ఉమ్మడి కృష్ణాలో భారంగా వ్యవసాయం

మూడేళ్లుగా రెండో పంటకు నీరు లేదు

డెల్టా ఆధునికీకరణ ఊసే మరిచారు..!

పంటబీమా, నష్టపరిహారం చెల్లింపుల్లేవ్‌..

మూడు నెలలకోసారి ధాన్యం బిల్లులు

సబ్సిడీపై యంత్ర పరికరాలు తూచ్‌..

అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి వస్తే కృష్ణాడెల్టా ఆధునికీకరణ అని నమ్మించారు. కాల్వలకు కొత్తరూపు తెచ్చి, కౌలు రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు.. ఏనాడూ రైతులకు ఉపయోగపడే ఒక్క పనికి కూడా వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది లేదు. పంట నష్టపరిహారం నుంచి ధాన్యం బిల్లులు, మద్దతు ధర వరకూ, యంత్రాల నుంచి రుణాల వరకూ అన్నింటా అష్టకష్టాలకు గురిచేశారు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లోనూ రైతులను గాలికొదిలేశారు. ఫలితంగా బంగారు పంటలకు నిలయమైన కృష్ణాతీరంలో సాగు చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆంధ్రజ్యోతి- మచిలీ పట్నం : ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3,23,131 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోంది. ఇందులో వరి 2.32 లక్షల హెక్టార్లు, పత్తి 50 వేల హెక్టార్లు, మిరప 10 వేల హెక్టార్లు, చెరకు 13 వేల హెక్టార్లు, పసుపు 2 వేల హెక్టార్లతో పాటు 15 వేల హెక్టార్లలో మొక్కజొన్నతో పాటు వేరుశెనగ, కంద, పెసర సాగవుతోంది. కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు, పూలతోటలు 10 వేల హెక్టార్లలో, ర బీ సీజన్‌లో 1.40 హెక్టార్లలో మినుము, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2021 రబీ సీజన్‌లో మాత్రమే రెండో పంటకు సాగునీరు విడుదల చేశారు. 2022 నుంచి విడుదల చేయలేదు. దీంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయారు. పనుల్లేక రైతు కూలీలు ఇబ్బందులపాలయ్యారు.

డెల్టా ఆధునికీకరణ పరిహాసం

హామీ : టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో రూ.2,180 కోట్ల డెల్టా ఆధునికీకరణ పనులకు పరిపాలనా ఆమోదం ఇచ్చి కొంతమేర చేశారు. వైసీపీ వచ్చాక ఈ పనులు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పింది.

వాస్తవం : జిల్లాలో బందరు, రైవస్‌, కేఈబీ తదితర ప్రధాన కాల్వలకు ఈ ఐదేళ్లలో కనీసం మట్టి, మరమ్మతు పనులు కూడా చేయలేదు. దీంతో కాల్వలో తూడు, గుర్రపుడెక్క, నాచు పేరుకుపోవడంతో పాటు గట్లు బలహీనంగా మారి నీటి విడుదలకు అడ్డుగా మారాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో ఏడు అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ల నిర్మాణానికి రూ.3,044 కోట్ల అంచనాతో రూపొందించిన పనులు పరిపాలనా ఆమోదం కూడా పొందలేదు. కృత్తివెన్ను మండలం నిడమర్రు వద్ద పెదలంక డ్రెయిన్‌పై రూ.40 కోట్లతో నిర్మించే అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని గూడూరు, పెడన, బంటుమిల్లి తదితర మండలాల నుంచి మురుగు నీటిని సముద్రంలో కలిపే లజ్జబండ డ్రెయిన్‌లో పూడికతీత పనులకు రూ.7 కోట్లతో అంచనాలు రూపొందించినా ఐదేళ్లుగా ఏమాత్రం ముందుకు కదల్లేదు. రెండేళ్లుగా పంటకాల్వలు, డ్రెయిన్లలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ (ఓఅండ్‌ఎం) పనులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. 2022-23 సంవత్సరంలో ఈ పనులకు రూ.57 కోట్లు కేటాయించగా, 2023-24 సంవత్సరంలో రూ.29 కోట్లకు కుదించారు. ఈ పనులు సక్రమంగా చేయకపోవడంతో గత డిసెంబరులో సంభవించిన మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా డ్రెయిన్ల నుంచి నీరు త్వరితగతిన బయటకు పోలేదు. రోజుల తరబడి పంట నీటిలో మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ధాన్యం బిల్లులు ఆలస్యం

హామీ : రైతులు ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పింది.

వాస్తవం : నాలుగేళ్లుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసింది. మూడు నెలలకు కూడా బిల్లులు అందని దుస్థితి ఏర్పడింది. దీంతో రైతులకు సాగులో మిగిలే లాభం.. అప్పులకు వడ్డీల రూపంలో చెల్లించడానికే సరిపోయింది. ఈ ఏడాది జనవరిలో కొన్న రూ.355.40 కోట్ల మేర ధాన్యం బిల్లులు మార్చి నెలాఖరు వరకు చెల్లించకుండా జాప్యం చేశారు. 2021లో అయితే రూ.600 కోట్ల బిల్లులను మూడు నెలల తరువాత చెల్లించారు.

కౌలు రైతులకు కష్టం

హామీ : జిల్లాలో కౌలు రైతులు 1.65 లక్షల మందికిపైగా ఉన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో పంటలు కోల్పోతే వారికి పంట నష్టపరిహారం, పంటబీమా, రైతు భరోసా వంటివి ఇస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఏడాదికి 50 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు చెప్పింది. గత డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు రూ.99 కోట్ల వరకు పంట నష్టపరిహారం ఇస్తామని కూడా భారీగా ప్రకటనలు గుప్పించారు.

వాస్తవం : కౌలు రైతులకు పంట రుణాలు సక్రమంగా ఇవ్వని దుస్థితి ఏర్పడింది. కౌలు రైతులు పంటలు కోల్పోతే నష్టపరిహారంగా ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి జమకాలేదు. రికార్డుల్లో మాత్రం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే రాయుతీలు, పంట నష్టపరిహారం వంటివేవీ అందలేదు. గత డిసెంబరులో కురిసిన వర్షాలకు ఇస్తామన్న రూ.99 కోట్ల పంట నష్టపరిహారం..

ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కినా ఇంతవరకు జమకాలేదు. పంటబీమా అంశంపై అధికారులు, ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పడంలేదు. సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వాల్సి ఉండగా, నిధులు విడుదల చేయలేదు.

మూడేళ్లుగా సాగునీరు లేదు..

వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా రబీ సీజన్‌లో సాగునీటిని విడుదల చేయలేదు. ఖరీఫ్‌లో పంటలు చేతికొచ్చే సమయంలో రెండేళ్లుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట నీటమునిగి దెబ్బతింది. రైతులు ఆర్థికంగా కుంగిపోయారు. రైతులకు ధాన్యం బిల్లులు సకాలంలో ఇవ్వలేదు. రెండో పంటగా వరి సాగుచేస్తే రైతులకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు ఉండేది. వైసీపీ ప్రభుత్వం రెండో పంటకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో తీర ప్రాంతంలోని రైతులు, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. - గోపు సత్యనారాయణ, కానూరు, బందరు మండలం

పంటకాల్వలు, డ్రెయిన్లకు మరమ్మతులు చేయలేదు..

ఐదేళ్లుగా పంట కాల్వలు, డ్రెయిన్లకు కనీస మరమ్మతులు చేయలేదు. ఖరీఫ్‌ సీజన్‌లోనూ సాగునీరు సక్రమంగా రాక ఆయిల్‌ ఇంజన్లతో నీటిని తోడుకుని రైతులు పంటను బతికించుకోవాల్సి వచ్చింది. డిసెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పంటను కోల్పోయాం. నష్టపరిహారం ఇంతవరకు విడుదల చేయలేదు. డ్రెయిన్లలో పూడిక సక్రమంగా తీసి ఉంటే మురుగునీరు బయటకుపోయి పంటనష్టం కొంతమేరైనా తగ్గేది. రైతుల ఇబ్బందులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. - కొక్కు రామాంజనేయులు, బుద్దాలపాలెం, బందరు మండలం

Updated Date - May 02 , 2024 | 01:04 AM