Share News

పెంచుకుంటూపోతాం..ఇదా అర్ధం!?

ABN , Publish Date - May 02 , 2024 | 12:59 AM

జగన్‌ పాలన ఐదేళ్లూ.. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు దినదిన గండమే. తెల్లారితే రోజునెలా నెట్టుకురావాలో అనే దిగులు.. ఆర్థికంగా నిత్యం నలిగిపోవడమే. నెల జీతంతోనో, కనీస వేతనంతోనో, రోజు కూలీతోనో బతుకుబండిలాగే గడిచిన అయిదేళ్లూ పడరాని పాట్లు పడ్డారు.

పెంచుకుంటూపోతాం..ఇదా అర్ధం!?
పప్పులు

ఐదేళ్లూ బాదుడే.. బాదుడు

ఇదే వైసీపీ సర్కారు సంక్షేమం మతలబు

సామాన్య, మధ్యతరగతి వర్గాలన్నీ చిత్తు

అందుబాటులో లేని నిత్యావసరాల ధరలు

విద్యుత్‌ బిల్లులు, ట్రూఅప్‌ చార్జీల పేరిట భారం

ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీల్లోనూ అదే బాదుడు

చివరకు చెత్త పన్ను పేరిటా నరకం

జగన్‌ పాలన ఐదేళ్లూ.. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు దినదిన గండమే. తెల్లారితే రోజునెలా నెట్టుకురావాలో అనే దిగులు.. ఆర్థికంగా నిత్యం నలిగిపోవడమే. నెల జీతంతోనో, కనీస వేతనంతోనో, రోజు కూలీతోనో బతుకుబండిలాగే గడిచిన అయిదేళ్లూ పడరాని పాట్లు పడ్డారు. రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు ఓవైపు, ప్రభుత్వమే ఆ పన్ను ఈ పన్ను అంటూ పెంచడంతోపాటు విద్యుత్‌ చార్జీలు మొదలుకొని అన్ని రకాల చార్జీలను అమాంతం పెంచేయడం ఆయా వర్గాలను ఊపిరిసలపనివ్వలేదు. నిత్యావసర సరుకులు కొనాలంటే భయం.. కరెంటు బిల్లు వస్తే గుండెదడ.. ఇంటిపన్నులు, ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ల చార్జీలు.. చివరకు చెత్త పన్ను అంటూ బడుగుజీవుల కష్టాన్నీ పీల్చేసిన వైనాలు ఎన్నో. పెంచుకుంటూ పోతాం.. అని జగన్‌ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ. అది సంక్షేమ పథకాలకే పరిమితం కాలేదు.. ఇలా ఎడాపెడా చార్జీలు, ధరల పేరిట ఆ జనం నుంచి మళ్లీ లాగేసిన సిత్రాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని...

‘నిత్యావసరాలు’.. ఆకాశంలో..

పిఠాపురం, మే 1 : పప్పులు, ఉప్పులు, నూనెలు, మసాలా సరుకులు, పాలు ఇలా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. అడ్డూఅదుపూ లేకుండా ధరలు పెరుగుతున్నా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. బతుకు భారమై ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టలేదు. మేము అధికారంలోకి రాగానే అధిక ధరలపై ఉక్కుపాదం మోపుతాం. ధరలన్నింటినీ నియంత్రిస్తాం. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ చెప్పిన మాటలు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రకాల నిత్యావసరాలు 50 నుంచి 100 శాతం, మరి కొన్ని 100 నుంచి 300 శాతం వరకూ పెరిగాయి. ఉల్లిపాయల ధరలు కిలో రూ.230 వరకూ పెరిగినా చలనం కనిపించలేదు. టమాటాలు కిలో రూ.140కి పెరిగినా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు.ఐదేళ్ల కిందట కందిపప్పు ధర కిలో రూ.70-90 ఉండగా ఇప్పుడు రూ.200కి పెరిగింది. మినపప్పు ధర రూ.60 ఉండగా ప్రస్తుతం రూ.125, పెసరపప్పు రూ.70 నుంచి రూ.120, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలో గతంలో రూ.75 ఉండగా రూ.200 దాటి విక్రయించారు. ప్రస్తుతం రూ.120లు ఉంది. పెరగగా, పామాయిల్‌ రూ.55 నుంచి రూ.100కు పెరిగింది. బియ్యం సన్నరకం కిలో రూ.28 ఉండగా ఇప్పుడు రూ.56కి పెరిగింది. జీలకర్ర కిలో రూ.150 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.600-700 వరకూ పెరగగా, వెల్లుల్లి రూ.100 నుంచి 350కి పెరిగాయి. పాలు, ఇతర నిత్యావసరాలు, కూరగాయలు సహా నిత్య జీవనంలో ఉపయోగపడే అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుదల బాటలోనే ఉన్నాయి. అయినా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వాటి నియంత్రణపై దృష్టి పెట్టలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

చివరకు చెత్త పన్ను పేరిటా బాదుడే

రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం నగరం ఉమ్మడి ఉభ యగోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రం. ఈ నగరం వైశాల్యం 44 చదరపు కిలోమీటర్లు.50 డివిజన్లు, 95 వేల నివాస గృహాలు, 20 వేల కమర్షియల్‌ భవ నా లతో నగరం విస్తరించి ఉంది.ఏటా పన్నుల రూపేణా రాజమహేంద్రవరానికి రూ.45 కోట్లు డిమాండ్‌ ఉంది. ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కమర్షియల్‌, రెసిడెన్సియల్‌ భవనాలు,వ్యాపార సముదాయాల పన్నులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న వెంటనే పెంచివేసింది. పన్నులు చెల్లిస్తున్న వారి భవనాలను బట్టి ప్రతి ఏటా 0 నుంచి 15 శాతం అదనంగా పన్నులను పెంచారు. పన్నుల విధా నంలో 5,7,10,15 శాతం వరకూ పెంచుకుంటూపోయారు.దీంతో నివాస,వాణిజ్య పన్నుల భారం కూడా ప్రజలపై పడింది.రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు పెంపు చేశారు. చివరకు చెత్త పన్ను పేరిట ఒక కొత్త పన్ను విధానాన్నీ వైసీపీ సర్కారు అమల్లోకి తెచ్చింది

విద్యుత్‌ చార్జీల మోత మోగించారు..

పిఠాపురం : వైసీపీ పాలనలో విద్యుత్‌చార్జీల మోత మోగించారు. బిల్లుల భారం మూడు రెట్లు పెరిగింది. సర్దుబాట్లు పేరుతో విధించిన సర్‌చార్జీలు ప్రజలకు షాక్‌ను ఇచ్చాయి. ఐదేళ్ల క్రితం నెలకు రూ.200-300 మధ్య వచ్చే విద్యుత్‌ బిల్లులు ప్రస్తుతం రూ.500నుంచి రూ.750 వరకూ వస్తున్నాయి. విద్యుత్‌ చార్జీలను ఐదేళ్లపాటు పెంచబోనంటూ ఎన్నికల ముందు ప్రకటించిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు షాక్‌ ఇచ్చారు. శ్లాబుల మార్పుతో మొదలు పెట్టి సర్ధుబాటు చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపారు. విద్యుత్‌ కొనుగోళ్ల భారాన్ని ప్రజలపైకి నెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీనివల్ల ఒకే సమయంలో నాలుగు సర్ధుబాటు చార్జీలను ప్రజలు చెల్లిం చారు. ఏకంగా విద్యుత్‌ చార్జీల శ్లాబుల సర్ధుబాటు, వినియోగ చార్జీలు, సర్దుబాటు చార్జీలు కలుపుకుని బిల్లులు 300శాతంపైగా పెరగడం, పలుమార్లు తనిఖీల్లో లోడు అధికంగా ఉందంటూ చార్జీలు చెల్లించాలని బిల్లులతో కలిపి ఇవ్వడంతో చెల్లింపులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జనం ఆస్తి.. జగన్‌ పెత్తనం!

- రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి

జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషను చార్జీలను అమాంతంగా పెంచేసింది. ఈ ఐదేళ్లలో భూములు/స్థలాల ధరలు ఏకంగా 200 శాతా నికి పైగా పెరిగిపోయాయి. మరోవైపు కార్డ్‌ప్రైమ్‌ పేరుతో జిరాక్స్‌ పత్రా లను హక్కుదారుడి చేతిలో పెట్టే పనికి తెరతీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక క్రమం తప్పకుండా ‘బాదుడు’ మాత్రం బాదేశారు. 2020, 2022, 2023 మే నెలలో అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లో అప్పటి వరకూ ఉన్న అధిక ధరలకు మరో 50 శాతం జోడించారు. అపార్ట్‌మెంట్లలో చదరపు అడు గుకు సుమారు 30 శాతం మేర అధికం చేశారు. జిల్లాల పునర్వవస్థీకరణ 2022 ఏప్రిల్‌లో జిల్లా కేంద్రాలతో పాటు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ధరలను పెం చింది. ఆ తర్వాత 2023 జూన్‌ 1 నుంచి మళ్లీ భూములు, రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతూ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. దీంతో ఐదేళ్ల కిందట రూ.10 వేలు ఉండే చదరపు గజం ప్రభుత్వ ధర ఇప్పుడు రూ.30 వేలకు చేరింది. మరోవైపు భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఆస్తి పత్రాలు ఒరిజినల్స్‌ ప్రభుత్వం వద్ద ఉంచుకొని జిరాక్స్‌ కాగితాలు హక్కుదారుడి చేతిలో పెట్టే బృహత్తర ‘పఽథకాన్ని’ జగన్‌ ప్రభుత్వం తెరపైకి తీసుకొ చ్చింది. కార్డ్‌ప్రైమ్‌ 2.0 పేరుతో కకావికలానికి తెరతీసింది. ఎన్నో ఏళ్లగా వస్తున్న పుస్తకంలో వేలిముద్రల విధానాన్ని తీసేసింది.డిజిటల్‌ రూపంలో సంతకంలో తేడా వస్తే భౌతికంగా నిరూ ప ణకు అవకాశమే లేదు.ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఇక్కడ మన బ్యాంకు అకౌంట్‌లో డబ్బులను సైబర్‌ నేరగాళ్లు దోచుకుపోతున్నారు.మరి భూ ములు/స్థలాల రిజిస్ట్రేషన్లలో డిజిటల్‌ సంతకాలనే నమ్ముకోవడంలో ‘ఆం తర్యం’ఏమిటో జగన్‌ సర్కారుకెరుక.

ఇంధన ధరపై తగ్గేదేలే..

పిఠాపురం : ఒక్క మన రాష్ట్రంలోనే పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. 2019 మేలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.79.07, డీజిల్‌ రూ.73 ఉండగా ప్రస్తుతం పెట్రోల్‌ రూ.109.31, రూ.97.17లకు పెరిగింది. దేశంలోనే ఈ ధరలు అధికం. రాష్ట్రంలో వివిధ రకాల పన్నులతో పాటు సర్‌చార్జీలను విధించడంతో ధరలు అధికంగా ఉన్నాయి. పలు రాష్ట్రాలు పన్నులు తగ్గించినా రాష్ట్రంలో మాత్రం తగ్గించేందుకు వైసీపీ సర్కారు అంగీకరించలేదు. కాకినాడ జిల్లాకు చెంతనే ఉన్న యానాంలో పెట్రోల్‌ లీటరు ధర రూ.94.84 ఉండగా, డీజిల్‌ ధర 84.68గా ఉంది. అంటే మన రాష్ట్రంతో పోల్చుకుంటే అక్కడ లీటరు పెట్రోల్‌ రూ.14.47, డీజిల్‌ రూ.12.49 తక్కువగా ఉంది.

మూడు సార్లు రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచేశారు..

సామాన్యుడు భూమి కొనుగోలు చేయలేని విధంగా రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచేశారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు దఫాలు భూమి రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచింది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూమి విలువ పది నుంచి 20 శాతానికి పెరిగింది.

- బీవీ.సుబ్రహ్మణ్యేశ్వరరావు, న్యాయవాది, ముమ్మిడివరం

చెత్తపై పన్ను వేసిన ఘనత జగన్‌దే..

ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్‌ చార్జీలు రెట్టింపు చేశారు. ఏకంగా 9 సార్లు చార్జీలు పెంచిన ఘనత జగన్‌దే. ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచారు. ఇవి సామాన్యులకు పెనుభారంగా మారాయి. చెత్తపై పన్ను వేసిన ఘనత వైసీపీకే దక్కుతుంది.

- సుంకర శ్రీనివాస్‌, సీహెచ్‌ గున్నేపల్లి

ఇష్టానుసారంగా నిత్యావసరాల ధరలు పెంపు

నిత్యావసర ధరలపై నియంత్రణ లేక ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి.గత టీడీపీ ప్రభుత్వంలో రూ.100 లు ఉండే కందిపప్పు ప్రస్తుతం రూ.200 ఉంది. అన్ని ధరలు రెట్టింపు పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

- కె.మంగాదేవి, గృహిణి, ముమ్మిడివరం

ఇంధన ధరల భారం మోపారు..

సామాన్యులపై ఇంధన ధరల భారం మోపారు. అన్ని రాష్ర్టాలు తగ్గించినా మన రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదు.ఇంధనంపై రకరకాల పన్నులు విధించడంతో సామాన్యుడు తట్టుకో లేకపోతున్నారు. వినియోగదారులపై భారం పెరిగింది.

- గోదశి గణేష్‌, పళ్లవారిపాలెం, టీవీ మెకానిక్‌

వైసీపీ ప్రభుత్వంలో బాదుడే..బాదుడు

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజలపై బాదుడే బాదు డు. నా ఉహ తెలిసిన తర్వాత ఇప్పటి వరకు చెత్తపై పన్ను కట్టడం తెలిదు. వైసీపీ ప్రభుత్వంలో మాత్రం చెత్తపై పన్ను వేశారు. దీనికి తోడు కరెంట్‌ బిల్లులు నిత్యావసర ధరలు పెంచేశారు. మళ్లీ ఇదే ప్రభు త్వం ఉంటే ఇక సామాన్యులు బ్రతకలేరు.

- చోడే రామచంద్రమూర్తి, మారేడుబాక, మండపేట మండలం

ఐదేళ్లలో అన్ని ధరలు భారీగా పెంచేశారు..

నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. పప్పులు, ఉప్పులు ఐదేళ్లలో భారీగా పెరిగాయి. వంట గ్యాస్‌, కరెంట్‌ బిల్లులు, చెత్తపై పన్ను ఇబ్బముబ్బడిగా పెంచేశారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి.

- చల్లా నాగమణి, మండపేట

గృహ సామగ్రి ధరలు పెరిగాయి..

చిన్న ఇల్లు కట్టుకుందామంటే పెరిగిన గృహ సామగ్రి ధరలు చూసి వెనకడుగు వేయాల్సి వస్తు ంది. ప్రభుత్వం ధరలు అదుపు చేయకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలకు సొంతిళ్లు కూడా ఉండవు.

- సోముల ఉపేంద్ర, బి.కొత్తూరు, తునిరూరల్‌

ఇంటి పన్నులు అమాంతం పెంచేశారు..

గత ఐదేళ్లలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒరిగిందేమీ లేదు. ఇంటిపన్ను పెంచేశారు. గతంలో ఇంటిపన్ను రూ.800లు చెల్లిస్తుంటే ఇప్పుడు ఏకంగా రూ.1150కు చేరింది.విద్యుత్‌ బిల్లులదీ ఇదే పరిస్థితి. కట్టలేకపోతున్నాం. గతంలో రూ.800 వస్తే నేడు రూ.1200 చెల్లిస్తున్నాం. ఇంట్లో ఏసీ కూడా లేదు. - సీహెచ్‌ మధుకిరణ్‌, బి.కొత్తూరు, తునిరూరల్‌

ఐదేళ్లలో అన్ని ధరలూ పెంచేశారు..

గత ఐదేళ్లలో కూరగాయలు, కందిపప్పు, నూనె, మిర్చి ఇతర ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉండేవి.నేడు ధరలు పెరిగి అవస్థలు పడుతున్నాం.

- బి.నరేష్‌, తుని

Updated Date - May 02 , 2024 | 12:59 AM