Share News

పాత పంచాయతీ భవనంలో మూడు మద్యం కేసుల స్వాధీనం

ABN , Publish Date - May 02 , 2024 | 03:06 AM

చంద్రగిరి మండలం ఐతేపల్లె పాత పంచాయతీ భవనంలో మూడు మద్యం కేసులను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పాత పంచాయతీ భవనంలో మూడు మద్యం కేసుల స్వాధీనం
పాత పంచాయతీ భవనంలో దాచిపెట్టిన మద్యం బాటిళ్లు

- వైసీపీ దాచిపెట్టిందన్న టీడీపీ ఫిర్యాదుతో వెలుగులోకి

చంద్రగిరి, మే 1: చంద్రగిరి మండలం ఐతేపల్లె పాత పంచాయతీ భవనంలో మూడు మద్యం కేసులను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులిత్తివారిపల్లెలో పాత పంచాయతీ భవనం నిరుపయోగంగా వుండడంతో డీలర్‌ రేవతి అందులో ఓ గది తీసుకుని గ్రామానికి రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. మరో గది తాళాలు పంచాయతీ కార్యదర్శి చంద్రబాబు.. ఐతేపల్లె సర్పంచ్‌ ఫజల్లా భర్త అంజాన్‌ఖాన్‌కు ఇచ్చారు. అయితే పాత పంచాయతీ భవనంలో మద్యం కేసులను వైసీపీ నాయకులు దాచిపెడుతున్నారని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులొచ్చి సర్పంచ్‌ భర్త వద్ద ఉన్న తాళాలు అడిగారు. తాళాలు తనవద్దలేవని, వైసీపీ కార్యకర్త నాగరాజుకు ఇచ్చినట్లు తెలిపారు. నాగరాజు అందుబాటులో లేకపోవడంతో పోలీసుల సాయంతో తాళాలను పగలగొట్టి తనిఖీ చేశారు. మూడు మద్యం కేసులను గుర్తించారు. అందులో 144 మద్యం క్వార్టర్‌ బాటిళ్లు ఉన్నాయి. ప్రభుత్వ భవనంలో అక్రమంగా మద్యం దాటి పెట్టడాన్ని టీడీపీ నాయకులు చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల అధికారి నిశాంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. వైసీపీ సర్పంచ్‌ భర్త ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు ఇవ్వడానికి మద్యం దాచిపెట్టినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పాకాల ఎక్సైజ్‌ సీఐ శ్రీహరి రెడ్డి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరు దాచిపెట్టారో దర్యాప్తులో తేలాక వారిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు.

Updated Date - May 02 , 2024 | 03:06 AM