Share News

రూ. 7 లక్షల మద్యం పట్టివేత

ABN , Publish Date - May 02 , 2024 | 03:05 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగచాటుగా రవాణా అవుతున్న పుదుచ్చేరి మద్యాన్ని భీములవారిపాళెం చెక్‌పోస్టులో సెబ్‌ అధికారులు పట్టుకున్నారు.

రూ. 7 లక్షల మద్యం పట్టివేత
పట్టుబడ్డ మద్యం కేసులను పరిశీలిస్తున్న సెబ్‌ అధికారులు

తడ, మే 1: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగచాటుగా రవాణా అవుతున్న పుదుచ్చేరి మద్యాన్ని భీములవారిపాళెం చెక్‌పోస్టులో సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. బుధవారం ఉదయం పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న మినీ చేపల లారీని ఆపిన సెబ్‌ అధికారులు తనిఖీ చేశారు. లారీలో చేపలను లోడ్‌ చేసుకొని వెళ్లే ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు పేర్చి ఉండటంతో అనుమానం వచ్చి కిందకు దింపారు. వాటి వెనుక మద్యం కేసులను గుర్తించి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీలో రూ.7.40 లక్షల విలువైన సుమారు 300 కేసులు (14,400 క్వార్టర్‌ బాటిళ్లు) మద్యాన్ని గుర్తించారు.పట్టుబడ్డ డ్రైవర్‌ కేరళ రాష్ట్రం కోజికోడ్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ ఫిరోజ్‌గా గుర్తించారు. విచారణలో పుదుచ్చేరిలోని గ్లోబల్‌ బేవరేజస్‌ నుంచి ఈ మద్యాన్ని తరలిస్తున్నట్లు తేలింది.నెల్లూరులోని ఓ ఐస్‌ ఫ్యాక్టరీ వద్దకు లారీని తీసుకెళితే అక్కడకు సంబంధిత వ్యక్తులు వచ్చి మద్యాన్ని మరో చోటకు తీసుకువెళతారని డ్రైవర్‌ చెప్పినట్లుగా తెలిసింది. అయితే డ్రైవర్‌ వద్ద ఉన్న ఫోన్‌ నెంబర్లను బట్టి విచారించగా లారీని సింగరాయకొండకు తీసుకువెళ్తున్నట్లు తేలింది.ఈ మద్యం కంపెనీలో మంగళవారమే తయారుచేసి వెంటనే రవాణా చేస్తున్నట్లు సమాచారం. అధికారుల దర్యాప్తులో ఈ మద్యాన్ని ఏ పార్టీ తరలిస్తోందో బయటపడే అవకాశం వుంది.

Updated Date - May 02 , 2024 | 03:05 AM