Share News

మాజీ సీఎం కిరణ్‌కు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - May 01 , 2024 | 12:10 AM

మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.

మాజీ సీఎం కిరణ్‌కు హైకోర్టులో ఊరట

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రొంపిచర్ల పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ నెలకు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆదేశాలిచ్చారు. ఎన్నికల అధికారి నుంచి ముందస్తు అనుమతి లేకుండా రొంపిచర్ల బస్టాండ్‌ ప్రాంతంలో సమావేశం నిర్వహించారని ఎంపీడీవో రెడ్డెప్ప ఆచార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌వీ సుమంత్‌ వాదనలు వినిపించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకొనేందుకు ఎన్నికల అధికారి నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ఎన్నికల అధికారే ఫిర్యాదు చేయాలన్నారు. ప్రస్తుత కేసులో ఎన్నికలతో సంబంధంలేని ఎంపీడీవో ఫిర్యాదు చేశారన్నారు. నిర్దిష్ట సమయానికి ముందే పిటిషనర్‌ సమావేశాన్ని ముగించారన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి... ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 01 , 2024 | 12:10 AM