Share News

రామచంద్రయాదవ్‌తో పాటు 13 మందిపై హత్యాయత్నం కేసు

ABN , Publish Date - May 01 , 2024 | 12:05 AM

సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో సోమవారం జరిగిన ఘర్షణకు సంబంధించి 13మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

రామచంద్రయాదవ్‌తో పాటు  13 మందిపై హత్యాయత్నం కేసు

పుంగనూరు, ఏప్రిల్‌ 30: సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో సోమవారం జరిగిన ఘర్షణకు సంబంధించి 13మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో పోలీసులే ఫిర్యాదుదారులయ్యారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బీసీవైపీ అభ్యర్థి రామచంద్రయాదవ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 21మంది, ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై రెండు హత్యాయత్నం, మరో రెండు వివిధ సెక్షన్లలో కేసులు పెట్టారు. బీసీవై పార్టీ ప్రచారంలో భాగంగా సోమవారం ఎర్రాతివారిపల్లె, కల్లూరు రోడ్డు ఆర్చి వద్ద, సదుం పోలీసుస్టేషన్‌ వద్ద వైసీపీ నేతలు రాళ్లు, కర్రల దాడులు, ప్రచార రథం దహనం, పలు వాహనాల ధ్వంసం చేసిన ఘటనలో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఎర్రాతివారిపల్లెలో ప్రచారం చేయడానికి అనుమతిలేకపోయినా బీసీవైపీ నేతలు రావడంపై తాము అడ్డుకున్నామని, రామచంద్రయాదవ్‌ మైకులో మాట్లాడుతూ అనుమతి అవసరంలేదంటూ రెచ్చగొట్టారని, పైగా వైసీపీ కార్యకర్త వేణురెడ్డిని, సర్పంచ్‌ మనోహర్‌, ఇందిరమ్మలను కొట్టిగొడవ చేశారని, అంతేగాక తమ విధులకు ఆటంకం కలిగించారని సదుం ఎస్‌ఐ ఇ.మారుతి ఫిర్యాదు చేశారు. రాళ్లదాడిలో ఎస్‌ఐ కాలికి గాయమైందన్నారు. ఈ కేసులో బీసీవైపీకి చెందిన రామచంద్రయాదవ్‌, ఆనందరెడ్డి, రమేశ్‌యాదవ్‌, అనిల్‌కుమార్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, హరినాథరెడ్డి, భరత్‌కుమార్‌, పరదేశి, వెంకటేశ్‌, ఓంప్రకాశ్‌, శివకుమార్‌, విశ్వనాథ్‌, లోకనాథంపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే ఎర్రాతివారిపల్లెకు అనుమతిలేదని, వెళ్లరాదని చెప్పినా వినకుండా బీసీవై పార్టీ శ్రేణులు రాయితో కొట్టి విధులకు అడ్డుతగిలారని సదుం హెడ్‌కానిస్టేబుల్‌ జి.చంద్రశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై రామచంద్రయాదవ్‌, భరత్‌కుమార్‌, ఆనందరెడ్డి, పరదేశి, వెంకటేశ్‌, ఓంప్రకాశ్‌, శివకుమార్‌, కైఫ్‌, ప్రసాద్‌ తదితరులపై కేసు నమోదు చేశారు.

వైసీపీ కార్యకర్తలపై కేసులు

ఎర్రాతివారిపల్లెకు అనుమతిలేకుండా ఎందుకు వస్తున్నారని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోగా రామచంద్రయాదవ్‌ బూతులు తిట్టి రెచ్చగొట్టడంతో వైసీపీ శ్రేణులు రాజన్న, ఆవులమణి, వెంకటరమణ, గురుమూర్తి, మనోహర్‌ మరికొందరు రాళ్లు, కర్రలతో వాహనాలు ధ్వంసం చేసి, పలువురిని గాయపరిచారని ఏఎ్‌సఐ షామీర్‌ ఫిర్యాదు చేశారు. దాడిలో భరత్‌కుమార్‌, ఆనందరెడ్డి, ఓంప్రకాశ్‌, దుర్గ, స్వాతి గాయపడ్డారని తెలిపారు. బీసీవైపీ వారిని చంపాలని కేకలు వేస్తూ వాహనాలపై దాడులు చేస్తూ వెంబడించినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. గ్రామంలోకి దౌర్జన్యంగా వచ్చి అడ్డువచ్చిన వేణురెడ్డిపై దాడిచేయడంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడినట్లు ఎస్‌ఐ మారుతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీ్‌సస్టేషన్‌ ఎదుట రోడ్డుపై ఉన్న బీసీవైపీ ప్రచార రథానికి నిప్పుపెట్టడం, వాహనాలు ధ్వంసం చేసి, రాళ్ల దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలు హరి, వంశీ, గురుమూర్తి, జావీద్‌, రమేశ్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా సదుం విధ్వంసంపై అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి, చిత్తూరు ఎస్పీ మణికంఠ, పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి సమీక్షించారు.

ఇల్లు దగ్ధం గురించి పట్టించుకోని డీఐజీ

సదుం మండలం చిలకపాటివారిపల్లెలో బీసీవైపీ నాయకుడు ఆనందరెడ్డి ఇంటికి తాళాలు వేసి పెట్రోల్‌ పోసి వైసీపీ మూకలు నిప్పు పెట్టాయి. ఇంటిలోని కారును ధ్వంసం చేసి, యాక్టివా స్కూటర్‌ను కాల్చివేసి బీభత్సం సృష్టించినా దాని గురించి డీఐజీ అమ్మిరెడ్డి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.

ఆస్పత్రికి తీసుకెళ్లిన బీసీవైపీ శ్రేణులు ఎక్కడ..?

సదుం విధ్వంసంలో గాయపడిన బీసీవై పార్టీ నేతలు 12మందిని పుంగనూరు పోలీసులు వైద్యం కోసం సోమవారం రాత్రి తీసుకెళ్లగా మంగళవారం రాత్రి వరకు తిరిగి రాలేదు. దీనిపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలను వైసీపీ మూకలు ధ్వంసం చేయడంతో పోలీసులు వారి వాహనాల్లో సదుం పోలీ్‌సస్టేషన్‌ నుంచి రామచంద్రయాదవ్‌, వారి అనుచరులను పుంగనూరులో ఇంటికి చేర్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వైసీపీ దాడిలో గాయపడిన బీసీవైపీ నాయకులు వెంకటేశ్‌, వేణుగోపాల్‌రెడ్డి, అనీల్‌కుమార్‌రెడ్డి, శివతో కలిపి 12మందిని సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ మహ్మద్‌ రఫీ పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని పోలీసులు బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫోన్లు స్విచ్‌ఆ్‌ఫ వస్తోందన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:05 AM