Share News

రెచ్చిపోయిన రౌడీ పోలీస్‌!

ABN , Publish Date - May 02 , 2024 | 03:03 AM

శ్రీకాళహస్తిలో ఓ పోలీసు రెచ్చిపోయాడు. అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్లో ఓ వివాహితపై దాడికి పాల్పడ్డాడు.అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌పై వీరంగం చేశాడు.

రెచ్చిపోయిన రౌడీ పోలీస్‌!

స్టేషన్‌లోనే వివాహితపై దాడి

హెడ్‌ కానిస్టేబుల్‌పై వీరంగం

వలంటీర్‌ ఆత్మహత్య కేసులో జైలుకెళ్లిన నేపథ్యం ఆయనది

పలుకుబడితో అదే స్టేషన్‌లో తిరిగి కానిస్టేబుల్‌గా నియామకం

శ్రీకాళహస్తి, మే 1: శ్రీకాళహస్తిలో ఓ పోలీసు రెచ్చిపోయాడు. అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్లో ఓ వివాహితపై దాడికి పాల్పడ్డాడు.అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌పై వీరంగం చేశాడు. పోలీసుశాఖలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటన పూర్వాపరాలివి.... శ్రీకాళహస్తి సన్నిధివీధి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పట్టణంలోని ఓ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేసేవాడు.స్టేషన్‌ తరపున ముక్కంటి ఆలయంలో ప్రోటోకాల్‌ దర్శనాలు చేయించేవాడు. పలుకుబడితో స్థానికంగా ఏళ్ల తరబడి పాతుకుపోయాడు.వివాహమై ఇద్దరు పిల్లలున్నప్పటికీ కొందరు యువతులతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో ఒక వలంటీర్‌తో చనువు ఏర్పడింది.అలాగే ఓ వివాహితతో సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్‌ తన తండ్రితో వెళ్లి పెళ్లి చేసుకోమంటూ ప్రాధేయపడింది. ఆ సమయంలో కానిస్టేబుల్‌, ఆయన కుటుంబ సభ్యులు కలిసి తండ్రి ఎదుటే తనను దారుణంగా అవమానించారంటూ రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి ఉరేసుకుని చనిపోయింది. ఆ లేఖ ఆధారంగా ఆ కానిస్టేబుల్‌తో పాటు అతడితో సన్నిహితంగా వివాహితపై కేసు నమోదు చేశారు.ఇద్దరికీ రిమాండ్‌ విధించడంతో జైలుపాలయ్యారు. దీంతో కానిస్టేబుల్‌ కొంతకాలం సస్పెండయ్యారు.కొద్ది నెలల క్రితం అజ్ఞాతం నుంచి బయటపడ్డ అతడు మళ్లీ అదే స్టేషన్లో కానిస్టేబుల్‌గా చేరాడు.మద్యం మత్తులో మంగళవారం రాత్రి తనకు సన్నిహితురాలైన వివాహితకు ఫోన్‌ చేసి శ్రీరామ్‌ నగర్‌ కాలనీలోని ఆమె ఇంటివద్దకు వెళ్లాడు.ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె నేరుగా స్టేషన్‌కి వెళ్లి కానిస్టేబుల్‌ తీరును వివరించింది.అక్కడ విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించాడు.ఆమెను వెంబడిస్తూ కారులో స్టేషన్‌కు చేరుకున్న కానిస్టేబుల్‌ అది గమనించి రెచ్చిపోయాడు. నా మీదే కంప్లైంట్‌ రాసివ్వమంటావా అంటూ హెడ్‌ కానిస్టేబుల్‌ను బూతులు తిట్టాడు. అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న వివాహితపై దాడికి తెగబడ్డాడు.దీంతో ఆమె విలపిస్తూ ఇంటిబాట పట్టింది.ఈ ఘటనపై సీఐకి లిఖితపూర్వకంగా హెడ్‌ కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేశారు.ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.

శృతి మించిన లోకలిజం...!

శ్రీకాళహస్తి పోలీస్‌ శాఖలో లోకలిజం శృతి మించిపోతోంది. నిబంధనల ప్రకారం స్థానికంగా పోలీసులకు విధులు కేటాయించకూడదు.ఒకవేళ కేటాయించినా కాలపరిమితి ముగిసిన తర్వాత తప్పనిసరిగా బదిలీ చేయాలి.ఇందులో ఏ ఒక్క నిబంధన కూడా శ్రీకాళహస్తిలో చాలామందికి అమలు కావడం లేదు. ఇలా పాతుకుపోయిన వారిలో చాలామంది చట్ట వ్యతిరేక వ్యాపారాల్లో భాగస్వాములయ్యారన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.ఆర్థికంగా బలవంతులైపోయి ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో అధికారులపై తిరగబడి దుర్భాషలాడిన ఘటనలు కూడా జరిగాయి. ఇంత జరుగుతున్నా ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారిని ఎవరూ కదపడం లేదు. కాబట్టే స్టేషన్లోనే హెడ్‌ కానిస్టేబుల్‌పై కానిస్టేబుల్‌ రెచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇకనైనా అధికారులు రక్షకభటుల ప్రక్షాళనపై దృష్టి సారించాల్సి వుంది.

Updated Date - May 02 , 2024 | 03:03 AM