Share News

ఎనిమిదేళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స

ABN , Publish Date - May 02 , 2024 | 03:12 AM

పుట్టుకతో అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారికి శస్త్ర చికిత్స చేసి, ప్రాణాలను నిలబెట్టామని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిప్రభు తెలిపారు.

ఎనిమిదేళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
కోలుకున్న చిన్నారితో వైద్య బృందం

తిరుపతి(వైద్యం), మే 1: పుట్టుకతో అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారికి శస్త్ర చికిత్స చేసి, ప్రాణాలను నిలబెట్టామని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిప్రభు తెలిపారు. రుయా చిన్నపిల్లల విభాగంలో బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం దళవాయిపల్లెకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి హిమశ్రీకి పుట్టినప్పటి నుంచి కాళ్లకు, పొట్ట కింద భాగానికి రక్త సరఫరా వ్యతిరేక దిశలో జరుగుతుంది. దీంతో బాలిక పొట్ట నుంచి కాళ్ల వరకు శరీరం అంతా పచ్చని రంగులోకి మారి ప్రమాదకరంగా తయారైంది. ఈ సమస్యతో చిన్నారి సరిగ్గా నడిచే పరిస్థితి కూడా లేకపోయింది. పలు ఆస్పత్రుల్లో చూపించినా, దీనికి చికిత్స లేదని చెప్పడంతో వారం కిందట రుయా చిన్నపిల్లల విభాగానికి బాలికను ఆమె తల్లి సుశీల తీసుకొచ్చింది. కార్డియో థొరాసిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ కళ్యాణి రమ పరీక్షించి బాలిక లార్జ్‌ ఆర్టీరియో వీనస్‌ మాల్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ బై లెటర్‌ లోయర్‌ లింబ్స్‌, అబ్డామిన్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌, డాక్టర్‌ రాధా సాయంతో అధునాతన పద్ధతిలో చిన్నారికి నాన్‌ ఇన్వేషు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ అనే టెక్నిక్‌తో కోత, కుట్లు లేకుండా శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి పూర్తిగా కోలుకోవడంతోపాటు సాధారణంగా నడుస్తుందని రవిప్రభు తెలిపారు. ఇటీవల రుయాస్పత్రిలో చేస్తున్న అరుదైన శస్త్ర చికిత్సలకు సంబంధించిన వివరాలు పత్రికల్లో చూసి వీరు ఇక్కడకు వచ్చారన్నారు. ఏఆర్‌ఎంవో డాక్టర్‌ హరికృష్ణ, క్లినికల్‌ పర్ఫూజనిస్ట్‌ చిరంజీవి, నర్సింగ్‌ అధికారి రాధా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 03:12 AM