ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. చాలామంది డిసెంబర్‌ 31 రాత్రి నుంచే పార్టీలు, వేడుకలు చేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంటారు.

కొన్ని దేశాల్లో న్యూ ఇయర్‌కి వింత ఆచారాలు పాటిస్తుంటారు. అవేంటంటే..

స్పెయిన్‌లో న్యూ ఇయర్ వేళ 12 ద్రాక్షపండ్లు తింటారు. ఇలా చేస్తే ఏడాదంతా మంచే జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం.

డెన్మార్క్‌‌లో ఏడాది పొడవునా సేకరించిన ప్లేట్లు, ఇతర సామగ్రిని కొత్త ఏడాదిలో స్నేహితులు, బంధువుల ఇంటిముందు పగలగొడతారు.

జపాన్‌లో కొత్త ఏడాది వచ్చిన సందర్భంగా.. ఆయా దేవాలయాల్లో 108 సార్లు గంట మోగిస్తారు. ఈ కార్యక్రమాన్ని జోయా-నో-కానే అని పిలుస్తారు.

చిలీలో చాలా మంది డిసెంబర్‌ 31 రాత్రిని శ్మశానంలో గడుపుతారు. చనిపోయిన కుటుంబసభ్యులు, పూర్వీకులకు తోడుగా ఆ రాత్రి అక్కడే ఉండి.. నూతన ఏడాది ఇంటికి వెళ్లిపోతారు.

ఇటలీ, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఏడాది రోజున ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను కిటికిలో నుంచి బయటకు విసిరేస్తారు.

ఫిలిప్పీన్స్‌లో న్యూ ఇయర్ వేళ అదృష్టం కోసం గుండ్రని నాణేలు ఉంచుకుని పొల్కా డాట్ దుస్తులు ధరిస్తారు.

కొలంబియాలో నూతన సంవత్సరం తొలి రోజున ప్రజలు ఎక్కడికెళ్లినా సూట్‌కేసు తీసుకెళ్తారు. ఇలా చేస్తే ఏడాది మొత్తం విహారయాత్రలు చేసే అవకాశం వస్తుందని వారి నమ్మకం.

ఎస్టోనియాలో జనవరి 1న అక్కడి ప్రజలు ఏడుసార్లు ఫుడ్‌ లాగించేస్తారు. కొత్త ఏడాది మొత్తం సమృద్ధిగా ఉండాలనే ఆకాంక్షతోనే ఇలా చేస్తారట.

బ్రెజిల్‌లో న్యూఇయర్ రోజున తెలుపు దుస్తులు ధరించి సముద్రంలో ఏడుసార్లు అలలపై గెంతుతారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం.