నోటి దుర్వాసన తగ్గేందుకు ఈ టిప్స్ ఫాలో అయితే కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
కొంతమందికి నోరు ఎప్పుడూ దుర్వాసన వస్తూ ఉంటుంది. పలు రకాల నోటి సమస్యలు, నోటిలో తేమ తగ్గడం, అనారోగ్య కారణాల వల్ల ఇలా జరుగుతుంది.
నోటి దుర్వాసనను తొలగించే కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.
పళ్లు తోముకోవడం: దంతాల్లో రంధ్రాలు, పిప్పి పళ్లు ఏర్పడితే నోటిలో హానికర బ్యాక్టీరియాలు వృద్ధి పొందుతాయి. ఇవి కడుపులోకి చేరి పలు అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.
వీటివల్ల నోరు దుర్వాసన వస్తుంది. ఉదయం లేవగానే మళ్లీ రాత్రి పడుకునేముందు తప్పనిసరిగా పళ్లు తోముకోవాలి.
పళ్ల సందుల్లో ఆహార పదార్థాలు ఇరుక్కుంటే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
చిగుళ్లు భద్రం: నోరు పరిశుభ్రంగా లేకపోతే పంటి చిగుళ్లలో వాపు, పుండ్లు ఏర్పడుతాయి. వీటివల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది.
రోజూ పళ్లతోపాటు చిగుళ్లను కూడా శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ నూనె, ఈ విటమిన్ నూనె, ఆల్మండ్ నూనెల్లో ఒకదాన్ని తీసుకుని పంటి చిగుళ్ల మీద రాయాలి.
తర్వాత వేలితో గుండ్రంగా 5 నిమిషాలు రుద్దాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల చిగుళ్లు గట్టిపడతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
నాలుక శుభ్రం: నాలుక మీద ఆహారపదార్థాలు, నీరు ఒక పొరలా చేరతాయి. వీటి నుంచి కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే రోజుకు ఒక్కసారైనా నాలుకను శుభ్రం చేసుకోవాలి. దూది మీద గ్లిసరిన్ రెండు చుక్కలు వేసి దాంతో నాలుకపై మెల్లగా రుద్దుతూ శుభ్రం చేయాలి.
తర్వాత గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించాలి. నాలుక ఎప్పుడూ లేత గులాబీ రంగులో కనిపిస్తూ ఉండాలి.
ఒక గ్లాసు నీళ్లలో మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా ఒక చెంచా తేనె లేదంటే రెండు చెంచాల నిమ్మరసం కలిపి ఆ నీటితో నోరు పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.
రోజూ రాత్రి పడుకునేముందు ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
నీళ్లు తాగాలి: తరచూ మంచి నీళ్లు తాగుతూ నోరు తడారిపోకుండా చూసుకోవాలి. దీనివల్ల నోటిలో సూక్ష్మక్రిములు పెరగవు. నోరు, నాలుక తేమగా ఉంటే వాటి నుంచి దుర్వాసన రాదు.
సోంపు నమలాలి: భోజనం చేసిన తర్వాత చెంచా సోంపు గింజలు నమిలితే నోరు పరిశుభ్రమవుతుంది. జీర్ణక్రియ కూడా సజావుగా జరుగుతుంది.
పచ్చి ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి లాంటి ఘాటైన వాసన వచ్చే ఆహారం తిన్నపుడు నోటి శుభ్రతకు జాగ్రత్తలు తీసుకోవాలి.
యాపిల్ తినాలి: రోజూ ఒక యాపిల్ తింటే అందులోని పాలిఫెనాల్స్ దంతాలను, నాలుకను శుభ్రం చేస్తాయి. నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.
తులసి ఆకులు, పుదీనా ఆకులను తరచూ నమిలినా ప్రయోజనం ఉంటుంది.