Share News

ఒకదాని వెంట మరొక అల్పపీడనం

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:02 AM

హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఒకదాని వెంట మరొక అల్పపీడనం

  • 21 నుంచి సీమ, 22 నుంచి దక్షిణ కోస్తాకు వర్షసూచన

విశాఖపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తీవ్ర అల్పపీడనంగా బలపడి శ్రీలంక వైపు రానున్నది. మరో అల్పపీడనం ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతుందని ఐరోపా వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత పశ్చిమ వాయవ్యంగా పయనించి 23వ తేదీకల్లా శ్రీలంకకు సమీపంగా రానున్నదని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20వ తేదీ తరువాత దక్షిణ తమిళనాడు, కేరళల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. తమిళనాడు వైపు వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ఈ నెల 21 నుంచి మూడు రోజులు రాయలసీమలో, 22 నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కోస్తాలో పలుచోట్ల పొగమంచు కురిసింది. పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని, ఎండ తీవ్రత స్వల్పంగా పెరుగుతుందని తెలిపింది.

Updated Date - Feb 19 , 2026 | 05:02 AM