Share News

వాతావరణ అనిశ్చితి!

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:29 AM

సాధారణంగా వేసవి సీజన్‌లో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈ ఏడాది కాస్త ముందుగానే పడ్డాయి. మూడు రోజుల నుంచి కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మధ్యాహ్నం నుంచి...

వాతావరణ అనిశ్చితి!

  • రుతుపవన ముందస్తు వర్షాలు కాస్త ముందుగానే...

  • వాతావరణంలో మార్పులే కారణం

  • రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులతో వానలు

  • ఎచ్చెర్లలో 4.3 సెం.మీ. వర్షపాతం

  • నేడు కోస్తాలో పిడుగులతో వర్షాలు

విశాఖపట్నం/అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సాధారణంగా వేసవి సీజన్‌లో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈ ఏడాది కాస్త ముందుగానే పడ్డాయి. మూడు రోజుల నుంచి కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు ఇది సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా ఎండలు పెరగడం, సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ సీజన్‌లో సుదీర్ఘమైన శీతాకాలం కొనసాగింది. చలి తీవ్రత ఉన్న సమయంలోనే ఎండలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో అక్కడక్కడ ఆవరించిన అధికపీడనం ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ అనిశ్చితితో మధ్యభారతం, దానికి ఆనుకుని ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో భాగంగానే బుధవారం శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 4.3 తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 2.5, పోలవరం జిల్లా దేవీపట్నంలో 2.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది.


కర్నూలులో 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అకాల వర్షాలు, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Updated Date - Feb 26 , 2026 | 05:29 AM