Share News

నేడు రాష్ట్రంలో గాలివానలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:07 AM

గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది.

నేడు రాష్ట్రంలో గాలివానలు

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకున్నాయని, రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ప్రధానంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోసిన పం టలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. విద్యుత్‌ స్తంభాలు, చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - Mar 16 , 2026 | 04:07 AM