Share News

దంచికొట్టిన వర్షం

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:07 AM

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు...

దంచికొట్టిన వర్షం

  • నిజామాబాద్‌ జిల్లా జానకంపేటలో అత్యధికంగా 8.2 సెం.మీ

  • జనగాం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం

  • పిడుగుపాటుకు ఇద్దరు బలి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా నిజామాబాద్‌, జనగాం, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 8.2 సెంటమీటర్లు, జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌ నెలలో సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. మరోవైపు, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అంతటా ఆదివారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి.సిరికొండ, మోస్రాలో 7.7 సెం.మీ, తూంపల్లిలో 7.5 సెం.మీ, ధర్పల్లిలో 7.4 సెం.మీ, యెడపల్లెలో 7.2, మోస్రా, సిరికొండ, జనగాం జిల్లా జాఫర్‌ఘడ్‌లో 7, చీమన్‌పల్లిలో 6.7, కామారెడ్డి జిల్లా భిక్కనూరులో 6.4 సెం.మీ, ఎడపల్లిలో 6.2, నవీపేటలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జిల్లాలో ఇదే తొలి భారీ వర్షం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల కూడా భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్యాల్‌లో 6.9 సెం.మీ, మల్లాపూర్‌లో 37.3 మి.మీ, బుద్ధేశ్‌పల్లిలో 22, అయిలాపూర్‌లో 19.8, పూడూర్‌లో 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం కురిసిన వర్షం ఎండిన నేలకు కాస్త ఊపిరి పోసినట్లయింది. దామరచర్ల మండలం తిమ్మాపురంలో అత్యధికంగా 4.6సెం.మీ, సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 4.3సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 3.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం పడింది. బోనకల్‌లో 79.5 మిల్లీమీటర్లు, వైరాలో 41.5, కల్లూరులో 35.8, రఘునాఽథపాలెంలో 29.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌లో 37.3, ములకలపల్లిలో 33.8, సుజాతనగర్‌ 22, ఆళ్ళపల్లి 14.3, దమ్మపేట 8, భద్రాచలం 3.8, చండ్రుగొండ 3, బూర్గంపాడు 3, జూలూరుపాడు 2.5, పాల్వంచలో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల వేళ సంభవించిన పిడుగుపాట్లు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన జెడ్డి దావీదు(22) అనే యువకుడు.. పొలంలో పత్తి గింజలు నాటుతున్న సమయంలో పిడుగు పడటంతో మృతి చెందాడు. కరీంనగర్‌లోని గోదాంగడ్డ ప్రాంతానికి చెందిన పోతు ప్రణీత్‌(11) అనే బాలుడు పిడుగుపాటుతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. తండ్రితో కలిసి మానేరు జలాశయం పరిసరాల్లో మేకల మేతకు వెళ్లగా.. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. నిజామాబాద్‌ జిల్లా టాక్లి గ్రామంలో పిడుగు పాటుకు రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి.

Updated Date - Jun 29 , 2026 | 05:07 AM