Share News

నేడు, రేపు భారీ వర్షాలు

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:29 AM

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది..

నేడు, రేపు భారీ వర్షాలు

  • కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లో 5.9 సెం.మీ.

  • రాష్ట్రవ్యాప్తంగా పడిన ముసురు వానలు

  • మేడిగడ్డకు 75 వేల క్యూసెక్కుల వరద

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ముసురు వానలు పడ్డాయి. కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. ములుగు జిల్లా మల్లంపల్లిలో 5.6, సిద్దిపేట జిల్లా కొండపాకలో 5.4, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ పొద్దంతా ముసురు పడింది. కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండంతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 75 వేల క్యూసెక్కులకు చేరింది. ఆదివారం ఉదయానికి ఇది లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లాలోని బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. పర్యాటకులు.. అక్కడ సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సంబరపడుతున్నారు.

Updated Date - Jul 05 , 2026 | 06:11 AM