ఉడికిపోయిన రాష్ట్రం!
ABN , Publish Date - May 21 , 2026 | 04:01 AM
ఎండ తీవ్రతకు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఈ సీజన్‌లోనే అత్యధిక పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. నిర్మల్ జిల్లాలో 46.5 డిగ్రీలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఎండ తీవ్రతకు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఈ సీజన్‌లోనే అత్యధిక పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూటే 32 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉండటం లేదు. 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 47 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న నాలుగు రోజులకు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెండు రోజులు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జిల్లాల కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తక్షణం వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత వరకు ప్రజలు మధ్యాహ్న ప్రయాణాలు చేయకుండా ఉండాలని సూచించారు.

నీటి ట్యాంకులోకి దిగి రెండు కోతులు మృతి
ఎండల తీవ్రతకు అల్లాడుతూ.. దాహం తీర్చుకొనేందుకు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్ష్‌పల్లి గ్రామంలోని మంచినీటి ట్యాంకులోకి నాలుగు కోతులు దిగాయి. వాటిలో రెండు కోతులు ట్యాంకులోకి దిగేందుకు ఉన్న ఇనుప చువ్వలపై చేరగా మరో రెండు నీట మునిగి మృతి చెందాయి.

వడదెబ్బతో 9 మంది మృతి
వడదెబ్బతో రాష్ట్రంలో బుధవారం 9 మంది మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన ఉపాధి కూలీ నేరెళ్ల సోమయ్య(75), వరంగల్ నగరం శంభునిపేట దూపకుంటరోడ్ ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు కౌరోజు నాగరాజు(38), హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యాకర అశోక్(35) అనే కూలీ, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ సౌరపు సారమ్మ(55), సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన లారీ క్లీనర్ బోడ లింగరాజు(34), కరీంనగర్ జిల్లా హుజూర్‌బాద్ పట్టణానికి చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీష్(40), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన యాచకుడు హింగే రాజిరెడ్డి(55), రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన మహిళా రైతు కోరెపు లచ్చవ్వ(60), ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లెకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బోడ సాంబయ్య(48) వడదెబ్బతో మృతి చెందారు.
ద్విచక్రవాహనంలో మంటలు
మంచిర్యాల జిల్లా మల్లంపేట అటవీ ప్రాంతంలో ఓ ద్విచక్రవాహనం ఎండవేడికి దగ్ధమైంది. వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఎల్కరి సం జీవ్ కుటుంబంతో ద్విచక్రవాహనంపై చెన్నూర్ వెళ్తుండగా దాని నుంచి పేలి న శబ్దం వచ్చింది. దీంతో అందరూ దిగి దూరం పరుగెత్తి క్షేమంగా బయటపడ్డారు. ద్విచక్రవాహనం మంటల్లో దగ్ధమైంది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఆదిలాబాద్ వెళ్లివస్తుండగా కెరమెరిలో టైరు నుంచి పొగలు వచ్చా యి. గమనించిన ప్రయాణికులు అప్రమత్తం చేయగా డ్రైవర్ బస్సును నిలిపివేశారు.