ఉక్కపోతలో రాష్ట్రం
ABN , Publish Date - May 17 , 2026 | 05:15 AM
రాష్ట్రంలో ఉక్కపోత కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోరాజ్‌లో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఆదిలాబాద్ బోరాజ్‌లో 44.5 డిగ్రీలు
ఎండల తీవ్రతకు వనపర్తి జిల్లాలో 3 వేల కోళ్ల మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో అకాలవర్షం
పిడుగుపాటుకు యువరైతు దుర్మరణం
హైదరాబాద్, అమరచింత, మహబూబ్‌నగర్, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉక్కపోత కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోరాజ్‌లో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పగటిపూట 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో నగరం నిప్పుల కొలమిలా మారింది. కాగా, రానున్న మూడు రోజులలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీకి నాలుగు రోజులు అటు ఇటుగా అవి కేరళను తాకుతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని, ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎండల తీవ్రతకు వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామ పరిధిలోని ఓ కోళ్లఫాంలో 3 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఎండలను దృష్టిలో ఉంచుకొని కోళ్ల ఫారం షెడ్లపైన యజమాని రాజసింహారెడ్డి నీటిని పిచికారి చేసే ఏర్పాటు చేసినప్పటికీ.. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు నిలిచిపోవటంతో వేడికి తాళలేక కోళ్లు భారీసంఖ్యలో ప్రాణాలు విడిచాయి. మరోవైపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి వర్షపునీటిలో కొట్టుకుపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా తుపతురాల గ్రామానికి చెందిన నగేష్ (26).. తమ పొలం కల్లాల దగ్గర ఉన్న మిరప పంట తడవకుండా టార్పాలిన్ కప్పేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై మరణించారు. కొల్లాపూర్ మండల పరిధిలోని యన్మన్‌బెట్ల గ్రామంలో రైతు వెలగొండ చిన్న వెంకట యాదవ్‌కు చెందిన సుమారు 30 గొర్రెలు పిడుగు పాటుకు గురై మృత్యువాత పడ్డాయి.