Share News

వడదెబ్బ మృతుల కుటుంబాలు పరిహారం పొందాలంటే..పోలీసు ఫిర్యాదు, పోస్టుమార్టం తప్పనిసరి

ABN , Publish Date - May 25 , 2026 | 04:39 AM

వడ దెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సర్కారు ప్రకటించిన రూ.4 లక్షల పరిహారం పొందడానికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు..

వడదెబ్బ మృతుల కుటుంబాలు పరిహారం పొందాలంటే..పోలీసు ఫిర్యాదు, పోస్టుమార్టం తప్పనిసరి

  • రెవెన్యూ అధికారులకూ సమాచారం ఇవ్వాలి

  • ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరిపి ఇచ్చేని వేదిక ఆధారంగా.. సర్కారు తుది నిర్ణయం

  • వడగాడ్పులతో 3 రోజుల్లో 100 మందికిపైగా మృతి.. రోజురోజుకు పెరుగుతున్న మరణాలు

  • నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు : వాతావరణ శాఖ

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): వడ దెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సర్కారు ప్రకటించిన రూ.4 లక్షల పరిహారం పొందడానికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరైనా ఎండదెబ్బ కారణంగా చనిపోతే, వారి కుటుంబసభ్యులు ముందుగా సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వాలి. వడదెబ్బ కారణంగానే ఆ వ్యక్తి మరణించినట్టు ఫిర్యాదు చేయాలి. అలాగే, సమీపంలో ఉండే ఆరోగ్య కార్యకర్త లేదా ఏఎన్‌ఎం, గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి, స్థానిక రెవెన్యూ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వాలి. మరణానికి కారణం ఏమిటో తెలియడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో.. మృతదేహానికి పోస్టుమార్టం చేయించాలి. వీటన్నింటికంటే ముఖ్యం.. మరణం సంభవించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ నమోదై ఉండాలి. ఈ వివరాలన్నింటినీ.. ముగ్గురు సభ్యులతో (మండల రెవెన్యూ అధికారి, వైద్యాధికారి, సంబంధిత పోలీ్‌సస్టేషన్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో) కూడిన కమిటీ పరిశీలించి, సంయుక్త విచారణ జరిపి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి వివరాలు పంపుతారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు పంపే సమాచారం ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. వడదెబ్బ మృతుల కుటుంబసభ్యులకు పరిహారం ప్రకటిస్తుంది.


రక్షణ ఇలా..

బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వారు ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండాలంటే.. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలి. నీళ్లతోపాటు మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, గ్లూకోజ్‌ వంటివి తాగడం వల్ల శరీరానికి అవసరమైన లవణాలు అందుతాయి. శరీరాన్ని డీహైడ్రేట్‌ చేసే కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌, ఆల్కహాల్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులు ఽధరించాలి. వీలైతే గొడుగు, టోపీ వంటివాటిని వాడాలి. తక్కువ నూనె, మసాలాలు ఉన్న తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. వీలైనంత మేరకు ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వారిని నీడపట్టున ఉంచాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువ నీరు తాగించాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలి. వైద్యులను సంప్రదించి వారికి ప్రాథమిక చికిత్స చేయించాలి. పరిస్థితి తీవ్రమైతే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి.

రోళ్లు పగిలే ఎండ..

రాష్ట్రంలో ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. జగిత్యాల జిల్లా బుద్దేశ్‌పల్లిలో అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు.. సోమవారం నుంచి రోహి ణి కార్తె మొదలుకానుంది. ‘రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ’ అని సా మెతే ఉంది. దీంతో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కూడా.. సోమ, మంగళవారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములు గు, కొత్తగూడేం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయితే కొన్నిజిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Updated Date - May 25 , 2026 | 04:39 AM