Share News

నిప్పుల కుంపటి!

ABN , Publish Date - May 22 , 2026 | 04:15 AM

భానుడి భగభగలతో తెలంగాణ నిప్పుల కుంపటిని తలపిస్తోంది.. ఎండలు, వడగాలులతో జనంతో పాటు మూగజీవాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో చాలాచోట్ల....

నిప్పుల కుంపటి!

  • భానుడి భగభగలతో మండిపోతున్న రాష్ట్రం

  • ఒక్కరోజే వడదెబ్బతో 17 మంది మృ తి

  • చాలాచోట్ల 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు

  • పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీలు

  • పలుచోట్ల అగ్ని ప్రమాదాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

భానుడి భగభగలతో తెలంగాణ నిప్పుల కుంపటిని తలపిస్తోంది.. ఎండలు, వడగాలులతో జనంతో పాటు మూగజీవాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో చాలాచోట్ల 46 డిగ్రీలకు పైగా ఎండలు కాయగా.. వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 17 మంది మృత్యువాతపడ్డారు. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగి భారీ నష్టాలు చోటు చేసుకున్నాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీలు నమోదవ్వగా.. పెద్దపల్లి జిల్లా రామగుండం, కమాన్‌పూర్‌, ఓదెల, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, హనుమకొండ జిల్లా కమాలాపూర్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, జమ్మికుంట, ధర్మపురి, మందమర్రి, నస్పూర్‌, ఆసిఫాబాద్‌, వేములవాడ రూరల్‌లో 46.4 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. వడదెబ్బ మృతుల్లో ఉమ్మడి జిల్లాల వారీగా నల్ల గొండ, వరంగల్‌ జిల్లాల్లో నలుగురు చొప్పున, కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్‌, మహ బూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఖమ్మంలో ఇద్దరు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఎండల తీవ్రతకు కోళ్ల ఫారాలలో వందల సంఖ్యల్లో కోళ్లు మృత్యువాతపడ్డాయు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం అనంతసాగర్‌లోనూ కోళ్ల ఫారాలలో కోళ్లు మరణించాయి.

మంటల్లో చిక్కుకొని రైతు సజీవ దహనం

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం నూలగడ్డ కొత్తపల్లిలో రైతు నూనెముంతల సత్తయ్య (72) తన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో వరి కొయ్యలను కాల్చేందుకు నిప్పు పెట్టగా.. మం టలు భారీగా వ్యాపించి ఆ మంటల్లోనే సజీవదహనమయ్యాడు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలోని దుబ్బతండాలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పుకు 10 మంది గిరిజన రైతుల 20 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. రూ. 20 లక్షల నష్టం వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో కౌలు రైతుఎనుగుల వెంకటయ్య వరి కొయ్యలకు నిప్పంటించగా మంటలు చెలరేగి బచ్చన్నపేట, పోచన్నపేట రెవెన్యూ శివారులో 75ఎకరాలకు విస్తరించి.. ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, ఇతరత్రా సామగ్రి దగ్ధమై రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. పొగతో పక్కనే ఉన్న కోళ్ల ఫారంలో వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందా యి. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో 10క్వింటాళ్ల మిర్చి తగలబడగా.. కోరుకొండపల్లిలో 100 ఎకరాల్లో వరి గడ్డి దగ్ధమైంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ మదీనా చౌరస్తా సమీపంలోని ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని దుస్తుల దుకాణాల్లో భారీగా మంటలు చెలరేగి పొగలు అలముకున్నాయి. ఈ ఘటనలో రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.


నేడు 11 జిల్లాల్లో వడగాలులు

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో శుక్రవారం వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

Updated Date - May 22 , 2026 | 04:15 AM