Share News

భగ్గుమన్న సూరీడు

ABN , Publish Date - May 19 , 2026 | 04:54 AM

రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 41-45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. తీవ్రమైన ఉక్కపోతకు వడగాల్పులు తోడయ్యాయి.

భగ్గుమన్న సూరీడు

  • నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లో 45.7 డిగ్రీలు

  • రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు నలుగురి మృతి

  • పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 41-45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. తీవ్రమైన ఉక్కపోతకు వడగాల్పులు తోడయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లో ఉష్ణోగ్రత అత్యధికంగా 45.7 డిగ్రీలకు చేరుకుంది. జగిత్యాల జిల్లా అయిలాపూర్‌, మల్లాపూర్‌లలో 45, సారంగాపూర్‌, మంచిర్యాల జిల్లా వెల్గనూరులలో 44.9, ఆదిలాబాద్‌లో 44.5, హైదరాబాద్‌లో 42.4, మహబూబ్‌నగర్‌లో 41.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, ఆదిలాబాద్‌, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో వడదెబ్బకు గురై నలుగురు మృతి చెందారు. వీరిలో తాపీమేస్ర్తీ, ఇద్దరు ఉపాధి కూలీలు, ఓ మహిళ ఉన్నారు. రాష్ట్రంలో రాగల మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల మధ్య నమోదవుతాయని హెచ్చరించింది.

Updated Date - May 19 , 2026 | 04:54 AM