సూరీడు@46
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:26 AM
రాష్ట్రంలో సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేసవి మొదలైన తర్వాత తొలిసారి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి.
నిజామాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
హైదరాబాద్‌లో 42.5 డిగ్రీలు
పలుచోట్ల సాయంత్రం జల్లులు
రాష్ట్రంలో వడదెబ్బతో ముగ్గురు, పిడుగుపాటుకు ఒకరి మృతి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేసవి మొదలైన తర్వాత తొలిసారి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. రాష్ట్రంలో వేర్వేరుచోట్ల వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. సోమవారం 12 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45డిగ్రీలపైగానే నమోదైంది. నిజామాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీలు రికార్డయింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీలు, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 45.8, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 45.6, సిరిసిల్ల జిల్లాలో 45.2, సిద్దిపేట జిల్లాలో 45డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో 42.5 డిగ్రీలుగా రికార్డయింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. సాయంత్రం పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో వేడిమి నుంచి ఉపశమనం కలిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మరో మూడు రోజులు ఉరుములు, కాగా, పలు జిల్లాల్లో కూడా సోమవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ కాసినా.. సాయంత్రానికి చల్లబడి, చిరుజల్లులు కురిశాయి. మరో మూడు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఉంటుందని, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీవ్రమైన ఎండలతో మంచిర్యాల జిల్లా గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. మామిడి తోటల్లో భారీగా కాయలు రాలిపడ్డాయి.
వడదెబ్బతో నలుగురి మృతి
వడదెబ్బ తగిలి మంచిర్యాల జిల్లాలో ఒకరు, పెద్దపల్లి జిల్లాలో మరొకరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన బోగారపు మారయ్య (56) శనివారం వంటచెరుకు కోసం అడవికి వెళ్లి దారితప్పిపోయాడు. అడవిలోనే తిరుగుతూ వడదెబ్బకు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అడవిలో గాలించగా సోమవారం ఓ వాగు వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన దశరథం సౌమ్య(19) వడదెబ్బతో మృతిచెందింది. కరీంనగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సౌమ్య వేసవి సెలవులకు ఇంటికి వచ్చి..మృత్యువాత పడింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు టైరోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు వడదెబ్బకు గురై, సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు అతడిని రాయచూర్ రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌లో రైతు కుర్మరంగు జంగయ్య(50) పొలంలో పిడుగుపాటుతో మరణించాడు.