అగ్ని గుండంలా రాష్ట్రం!
ABN , Publish Date - May 20 , 2026 | 03:17 AM
రాష్ట్రంలో గురువారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రేపటి నుంచి మరింత తీవ్రంగా ఎండలు
పలు జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా నమోదు అవుతాయని హెచ్చరిక
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో గురువారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్‌అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదు కావడం ఎండ తీవ్రతకు అద్దం పడుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉన్నాయి. హన్మకొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్, జనగాం, కామారెడ్డి, ఆదిలా బాద్ జిల్లాల్లో 44-45 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. హైదరాబాద్‌లోనూ ఎండ తీవ్రత 43 డిగ్రీలకు చేరింది. మరో 3-4 రోజుల తర్వాత ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగల రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అన్ని మండలాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో రెడ్ అలెర్ట్ ఉంది. మోపాల్ మండలం మంచిప్పలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంగళవారం అకాల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో గాలి దుమారానికి ఇళ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. చెట్లు విరిగి వాహనాపై పడ్డాయి.
పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్
రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎండ తీవ్రతకు సంబంధించి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45-47 డిగ్రీలకు పైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం వేళ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. కాగా, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఓ కారు ఎండవేడికి ఇంజిన్‌లో మంటలు చెలరేగి దగ్ధమైంది.
వడదెబ్బతో నలుగురి మృతి
వడదెబ్బతో మంగళవారం రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు పెద్దూర్‌కు చెందిన రైతు రాచర్ల రాజు(50), వికారాబాద్ జిల్లా తాండూరు మండ లం అంతారానికి చెందిన కార్మికుడు సామెల్ (35), ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడకు చెందిన కనక లచ్చు(52), అలాగే శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్‌కుమార్(45) వడదెబ్బతో మృతి చెందారు.