ఎండ, వాన.. ప్రచండం!
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:56 AM
ఇంట్లో ఉంటే ఉక్కబోత.. రోడ్ల మీదకు వెళితే మాడు పగులే ఎండ! ఇలా భానుడి ప్రతాపం ఆదివారం కూడా కొనసాగింది. సాయంత్రం మాత్రం కొన్నిచోట్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
పొద్దంతా సూర్యతాపంతో ఉక్కిరిబిక్కిరి
సాయంత్రం కొన్నిచోట్ల దంచికొట్టిన వర్షం
ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో 44.6 డిగ్రీలు
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో నలుగురి మృతి
గాలివానకు కూలిన విద్యుత్తు స్తంభాలు, చెట్లు
మామిడి, మొక్కజొన్న, ఉల్లి పంటలకు నష్టం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
హైదరాబాద్‌లోనూ వర్షం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ఇంట్లో ఉంటే ఉక్కబోత.. రోడ్ల మీదకు వెళితే మాడు పగులే ఎండ! ఇలా భానుడి ప్రతాపం ఆదివారం కూడా కొనసాగింది. సాయంత్రం మాత్రం కొన్నిచోట్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం పడింది. మార్నింగ్ వాక్ సమయమైన ఎనిమిదింటికే ఎండ తీవ్రత మొదలైంది. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టాపూర్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నారాయణపేట్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, గద్వాల.. ఈ పది జిల్లాల్లో 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత రికార్డయింది. సాయంత్రం కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, జుక్కల్, నియోజకవర్గాల్లో.. సిరిసిల్ల జిల్లా పెద్టూర్‌లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వర్షపునీళ్లకు కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. గాలివాన ఉధృతికి పొలాల్లో కోతకొచ్చిన వరి నేలకొరిగింది. కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో, శిశుమందిర్‌లోని భారీ వృక్షాలు కూలిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో మొక్కజొన్న, ఉల్లిపంటలు దెబ్బతిన్నాయి. యాచారం, చౌదర్‌పల్లి, కుర్మిద్ద, తాటిపర్తి, గున్‌గల్, ధర్మన్నగూడ, నందివనపర్తి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లోని మామిడితోటల్లో కాయలు రాలిపోయాయి. వడదెబ్బతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో మహిళా వ్యవసాయ కూలీ షేక్ మీరా (42), కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి వల్లెపు వెంకటమ్మ (60), కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన చాకలి మల్లయ్య (40), మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గుండ్లసోమారం గ్రామానికి చెందిన చల్లూరి రుక్మ (58) వడదెబ్బతో మృతిచెందారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో బాల మల్లేశ్, రవి పశువులను మేపుతుండగా సమీపంలో పిడుగుపడటంతో స్పృహ కోల్పోయారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మొరగంపల్లిలో ఓ రైతుకు చెందిన ఎద్దు చనిపోయింది. సిరిసిల్ల జిల్లా రాజీవ్‌నగర్‌లో పిడుగుపడటంతో తాటిచెట్టు దగ్ధమైంది. హైదరాబాద్‌లో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షమూ పడింది. ఫలితంగా ఎండతాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
కుత్బుల్లాపూర్, ఆల్వాల్, ఐడీఏ బొల్లారం, సైనిక్‌పురి, సాయినగర్, పేట్‌బషీరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల పరిధిలోని ఎంఎన్‌రెడ్డి నగర్‌లో ఓ భారీ వృక్షం కూలిపోవడంతో నాలుగు విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్‌లో పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంబాలు విరిగిపడ్డాయి. ఫలితంగా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు.. మరో రెండ్రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్నిచోట్ల వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా కొన్నాళ్లుగా ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావుల్లోంచి సరిపడా నీళ్లు రాకపోవడంతో తడి లేక యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద, నానక్‌నగర్, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో వరిపైరు ఎండిపోయింది. కొందరు రైతులు చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రూ.1000 చొప్పున చెల్లించి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తున్నారు. ప్రత్యేకించి కూరగాయ పంటలు వేసిన రైతులు పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.
15 రోజులు నీళ్లు పెట్టాలి.. రూ.1.5 లక్షల ఖర్చు
నాకు ఎకరం పొలం ఉంది. వరి పంట వేశాను. పెట్టుబడికి రూ.15వేలు అయింది. మరో 15 రోజులు నీరు పెడితే పంట చేతికొస్తుంది. అయితే బోరుబావిలోంచి నీరు రావడం లేదు. రోజుకు రెండు ట్యాంకర్లతో నీరు పెడుతున్నా. ట్యాంకర్‌కు రూ.వెయ్యి తీసుకుంటున్నారు. వచ్చే 15 రోజుల వరకు నీటి ట్యాంకర్లకు రూ.1.5లక్షలు అవుతుంది.
-విజయ, మహిళా రైతు, నానక్‌నగర్, రంగారెడ్డి జిల్లా