ఎల్‌నినో బలపడుతోంది
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:29 AM
భారత ఉపఖండంలో నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాల వ్యవస్థను బలహీనపరుస్తున్న ఎల్‌నినో ప్రభావంతో..
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.1 డిగ్రీలు ఎక్కువగా నమోదు
రానున్న నెలల్లో మరింత పెరిగే అవకాశం
వచ్చే ఏడాది వేసవి మరింత తీవ్రంగా ఉండే చాన్స్
భారత ఉపఖండంలో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం
కొన్నిచోట్ల వరదలు, వర్షాలు.. కొన్నిచోట్ల తీవ్ర కరువు
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఎల్‌నినో ఘటనలు
ఏయూ వాతావరణ విభాగాధిపతి సీవీ నాయుడు
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): భారత ఉపఖండంలో నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాల వ్యవస్థను బలహీనపరుస్తున్న ఎల్‌నినో ప్రభావంతో అరేబియా సముద్రం కూడా ఎక్కువ రోజులు స్తబ్దుగా ఉండిపోతోంది. అంతర్జాతీయంగా పలు వాతావరణ మోడళ్ల తాజా నివేదికల ప్రకారం ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ‘నినో 3.4’ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.1 డిగ్రీల ఎక్కువగా నమోదైంది. గతనెలలో నినో 3.4 సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.55 డిగ్రీలు ఎక్కువగా ఉండగా... నెల రోజుల్లో 0.6 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావడం అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది.
ఈ ఏడాది చివరికల్లా బలమైన ఎల్‌నినోగా..
ఉష్ణమండల పసిఫిక్ సముద్రంలో నినో 3.4 సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలు ఎక్కువగా ఉంటే ఎల్‌నినో వచ్చిందని నిర్ధారిస్తారు. భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక కీలక భౌగోళిక ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగించే వాతావరణ సూచికనే ‘నినో 3.4’గా పిలుస్తారు. వచ్చే నెలలో ఎల్‌నినో మరింత బలపడుతుందని, సాధారణంగా నవంబరు-ఫిబ్రవరి మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని గ్లోబల్ సీజనల్ క్లైమేట్ నివేదిక వెల్లడించింది. ఎల్‌నినో రెండు నుంచి ఏడు సంవత్సరాలకొకసారి వస్తుంది. ఒకసారి బలపడ్డాక తొమ్మిది నెలల నుంచి రెండు సంవత్సరాల వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం ఏర్పడిన ఎల్‌నినోకు సంబంధించి నినో 3.4 సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు దాటి నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా చాలా బలమైన/శక్తివంతమైన ఎల్‌నినోగా మారడానికి 80 శాతం అవకాశాలు ఉన్నాయని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) అంచనా వేసింది. ప్రపంచంలో 14 వాతావరణ నమూనాల అంచనాలను కలిపి చూస్తే ఈ ఎల్‌నినో సమయంలో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో గరిష్ఠ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 2015-16లో నమోదైన 2.75 డిగ్రీల ఎంటే ఎక్కువగా నమోదుకావొచ్చని నోవా వెల్లడించింది. ఒకవేళ శక్తివంతమైన ఎల్‌నినో అంచనాలు నిజమైతే సముద్రం నుంచి విడుదలయ్యే అపారమైన వేడి, మానవ ప్రేరిత గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలతో వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా వేడి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని, రోజుల తరబడి తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఎల్‌నినో సంభవించే సంవత్సరాల్లో దేశంలో రుతుపవన వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951-52 నుంచి ఇప్పటివరకూ 25 ఎల్‌నినోలు సంభవించాయి. ఎల్‌నినో మధ్యస్తం/తీవ్రమైనదిగా వర్గీకరించిన 16 సందర్భాల్లో 12 సార్లు సాధారణం లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
వ్యవసాయ రంగం కుదేలు
ఎల్‌నినో సంవత్సరాల్లో దేశంలో వ్యవసాయ రంగం నుంచి వచ్చే స్థూల ఆదాయం తక్కువగా ఉంటుందని పలు సందర్భాల్లో వెల్లడైంది. ఈ ఏడాది కూడా దేశ వ్యవసాయ రం గంపై ఎల్‌నినో ప్రభావం చూపుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయ వాతావరణ విభాగాధిపతి ఆచార్య సీవీ నాయుడు పేర్కొన్నారు. దేశంలో వాయవ్య ప్రాంతం రాజస్థాన్, దానికి ఆనుకుని గుజరాత్‌లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయని, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. దక్షిణాదిలో తేమగాలులు తక్కువగా ఉండడంతో వర్షాభావం నెలకొంటుందన్నారు. భూమధ్యరేఖ పసిఫిక్ సముద్ర ప్రాంతం, ఉత్తర భారతంలో నెలకొన్న ఉష్ణోగ్రతలు మధ్య తేడా తగ్గుతూ వస్తోందని, దీంతో రుతుపవనాలు తన సహజ సిద్ధమైన స్థితిని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఉష్ణమండల పసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.1 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని అన్నారు. అయితే హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ తటస్థం నుంచి క్రమేపీ పాజిటివ్ దిశగా పయనిస్తోందన్నారు. ఇది మరింత బలపడితే వచ్చే నెల నుంచి హిందూ మహాసముద్రం నుంచి తేమగాలులు వీచే అవకాశం ఉందని దీంతో దక్షిణ భారతంలో వర్షాలు పుంజుకుంటాయని అంచనా వేశారు.