Share News

నిస్తేజంగా రుతుపవనాలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 04:47 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌లో కీలకమైన జూలై నెలలో కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం రుతుపవనాలు దేశవ్యాప్తంగా..

నిస్తేజంగా రుతుపవనాలు

  • ఉపగ్రహ చిత్రాల్లో మేఘరహితంగా 70 శాతం ప్రాంతాలు

  • కోస్తాలో వడగాడ్పులు.. బాపట్లలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత

  • నేడు, రేపూ భగభగలే.. 16 తర్వాత అల్పపీడనం

విశాఖపట్నం, జూలై 11(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో కీలకమైన జూలై నెలలో కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినా కొద్దిచోట్ల మినహా మెజారిటీ ప్రాంతాల్లో వర్షాలు లేవు. రుతుపవనాలు నిస్తేజంగా ఉండటమే దీనికి కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. దేశంలోని 70 నుంచి 80 శాతం ప్రాంతాలు మేఘ రహితంగా ఉన్నట్టు శనివారం నాటి ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం లేదా అసలు వర్షపాతం లేదని గుర్తించాయి. దేశంలో రుతుపవనాల సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి హిందూమహాసముద్రం నుంచి వీచే తేమ గాలులు, రుతుపవనద్రోణి ప్రధాన కారకాలుగా చెబుతారు. అయితే పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన శక్తిమంతమైన ఉష్ణమండల తుఫాన్‌ ప్రభావంతో భారత ఉపఖండం వైపు తేమ రావడం లేదని, ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ఈనెల 15కల్లా ఉత్తర వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 16 తర్వాత ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తాజా బులెటిన్‌లో పేర్కొంది. జూన్‌లో దేశంలో 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ చివరి నుంచి జూలై ఐదారు తేదీల వరకు కురిసిన వర్షాలతో దేశంలో లోటు శాతం 14కు తగ్గినా అనేక ప్రాంతాల్లో వర్షాల జాడలేదు. రుతుపవనాలు తిరిగి పుంజుకునేంత వరకు దేశంలో పగటి ఉష్ణోగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శనివారం కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. బాపట్లలో 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో గాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jul 12 , 2026 | 04:48 AM