Share News

రేపే కేరళకు నైరుతి

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:52 AM

నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించనున్నాయి. అలాగే, తమిళనాడు, లక్షద్వీ్‌పలో పలు ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు గురువారం రుతుపవనాలు ...

రేపే కేరళకు నైరుతి

  • వచ్చేవారం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు: ఐఎండీ

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించనున్నాయి. అలాగే, తమిళనాడు, లక్షద్వీ్‌పలో పలు ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు గురువారం రుతుపవనాలు విస్తరించనున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. కేరళ, లక్షద్వీ్‌పలలో గడచిన రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో వాతావరణం రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వచ్చే ఏడు రోజుల్లో కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, వచ్చే వారం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య, మధ్య, తూర్పు, దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే వారం మోస్తరు నుంచి తీవ్రంగా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ నాటికి కేరళను రుతుపవనాలు తాకాలి. అయితే, ఈ ఏడాది మే 26వ తేదీ నాటికే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దానిని సవరించి.. మే 28వ తేదీ నుంచి జూన్‌ మూడో తేదీ మధ్య రుతుపవనాలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపింది. దానికంటే కూడా ఒకరోజు ఆలస్యంగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండటంతో రుతుపవనాల సీజన్‌లో దీర్ఘకాల సగటులో 90 శాతమే వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ఒడిదుడుకులకు గురైతే వ్యవసాయం రంగంపై తీవ్ర ప్రభావం పడి .. ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అందువల్ల కేరళలో ప్రవేశించనున్న రుతుపవనాల కదలికలను గమనిస్తామని ఐఎండీ తెలిపింది.

రాష్ట్రం భగభగ.. గూడూరులో 45.4 డిగ్రీలు

  • వాతావరణ అనిశ్చితితో పలుచోట్ల వర్షాలు

రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. ఓ వైపు ఎండ తీవ్రత, వడగాడ్పులు ప్రభావం చూపుతుండగా, మరోవైపు అక్కడక్కడ వర్షాలు పడి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. సోమవారంతో పోల్చితే మంగళవారం మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 45.4, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 44.9, ప్రకాశం జిల్లా కొండపిలో 44.6, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jun 03 , 2026 | 04:52 AM