Share News

సీమలో ‘నైరుతి’ విస్తరణ

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:17 AM

రాయలసీమలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు మొత్తం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.

సీమలో ‘నైరుతి’ విస్తరణ

  • కోస్తా, సీమల్లో వర్షాలు.. తెలంగాణకు రుతుపవనాలు

  • నేడు పలు జిల్లాలకు భారీ వర్షసూచన

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు మొత్తం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇంకా అరేబియా సముద్రం, బంగాళాఖాతం, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణాల్లో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, బంగాళాఖాతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లో పలు భాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రుతుపవనాల కారణంగా రాయలసీమ, ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి, దక్షిణ కోస్తా మీదుగా తూర్పు, పడమరకు విస్తరించిన షీర్‌ జోన్‌ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. కాగా, కోస్తాలో ఎక్కువచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. అయితే, గరిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 41.7, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 41.4, అనకాపల్లి జిల్లా ఎస్‌ రాయవరంలో 41.2, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, శ్రీసత్యసాయి, కడప, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని, ఎన్టీఆర్‌, పల్నాడు, కర్నూలు, తిరుపతి, శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.


కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని తెలిపింది. కాగా, మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 42-43, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40-42 డిగ్రీలు ఉంటాయని తెలిపింది.

Updated Date - Jun 09 , 2026 | 05:18 AM