Share News

రాష్ట్రంలోకి రుతుపవనాలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:27 AM

తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం! నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

రాష్ట్రంలోకి రుతుపవనాలు

  • సీమలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల వరకు విస్తరణ

  • దక్షిణ కోస్తాలో కొద్ది ప్రాంతానికి..

  • 2-3 రోజుల్లో ఏపీలోని మరిన్ని ప్రాంతాలకూ

  • నేడు రాయలసీమకు భారీ వర్షసూచన

విశాఖపట్నం/అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం! నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాలు, దక్షిణ కోస్తాలో నెల్లూరులోని కొద్ది ప్రాంతం వరకు విస్తరించాయి. రానున్న 2-3 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కేరళలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం, భూమధ్యరేఖ మీదుగా హిందూ మహాసముద్రం వైపు తేమగాలులు వీస్తుండడంతో రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి. శనివారం అరేబియా సముద్రంలో పలు ప్రాంతాలు, గోవా మొత్తం, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో చెన్నై వరకు, ఏపీ, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు, మిజోరం, మణిపూర్‌ వరకు విస్తరించాయి. 2-3 రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలోని మరిన్ని ప్రాంతాలు, తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఈశాన్య భారతంలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నాలుగైదు రోజుల్లో కర్ణాటక మొత్తం, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బెంగాల్‌ వరకు విస్తరించనున్నాయి. అంటే 4-5 రోజుల్లో ఏపీ మొత్తం లేదా ఎక్కువ భాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్‌ 5 నాటికి అనంతపురం, నెల్లూరు జిల్లాల వరకు రుతుపవనాల విస్తరణ జరగాలి. గతేడాది మే 26 నాటికే సీమలో అనేక ప్రాంతాలకు, కోస్తాలో కావలి వరకు విస్తరించాయి. రుతుపవనాల రాకతో ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండే నేపథ్యంలో అందుకు అనుగుణంగా రైతులు ఖరీఫ్‌ పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది.


40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో మరికొన్ని రోజులు భిన్న వాతా వరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం కోస్తాలో అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. పలు చోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 44, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.9, ఎన్టీఆర్‌ జిల్లా తొర్రగుడిపాడులో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి. రానున్న మూడు రోజులు కోస్తాలో వడగాడ్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉత్తర కోస్తాలో 58 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రుతుపవనాలు ప్రవేశించే ముందు కోస్తాలో ఎండ తీవ్రంగా ఉండడంతో పాటు వడగాడ్పులు వీస్తుంటాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

వారం పాటు పలు రాష్ట్రాలకు వర్షసూచన

నైరుతి రుతుపవనాలు దక్షిణాదిని దాటి మధ్య, తూర్పు, ఈశాన్య భారతం వైపు పురోగమించేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. 4 రోజుల నుంచి కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కేరళలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. 12 వరకు కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఎండలు, వడగాడ్పులతో ఉడుకుతున్న ఉత్తర భారతంలో వాతావరణ అనిశ్చితితో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి.

Updated Date - Jun 07 , 2026 | 05:28 AM