Share News

ఉడికిస్తున్న ఎండలు!

ABN , Publish Date - May 05 , 2026 | 04:04 AM

భానుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం వేళ చాలా జిల్లాల్లో రోడ్లన్నీ...

ఉడికిస్తున్న ఎండలు!

  • కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.9 డిగ్రీలు

  • పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు

  • వడదెబ్బతో వివిధ ప్రాంతాల్లో నలుగురి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

భానుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం వేళ చాలా జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా పిట్లంలో 45.8, గాంధారి 45.7, బాన్సువాడ 45.6, బీర్కూర్‌లో 45.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లోని పలు చోట్ల 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 42-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండల ప్రభావంతో ఉద యం పూట బస్సుల్లో ప్రయాణాలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వేసవి సెలవులు, శుభకార్యాల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. జేబీఎస్‌ నుంచి సాధారణ రోజుల్లో 70-80 వేల మంది ప్రయాణాలు సాగిస్తే వారం రోజులుగా వీరి సంఖ్య లక్షకు చేరింది. రద్దీకి తగినట్లు జిల్లాలకు ఆర్టీసీ బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్రంలో వడదెబ్బతో సోమవారం నలుగురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కొంచాడ శ్రీనివాసరావు (70), భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన రైతు తిప్పని సారయ్య (60), వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పశువుల కాపరి బొడ్డుపల్లి మురళి (45) ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పురోహితుడు బండవరం ప్రశాంత్‌ (30)కు వడదెబ్బ తగలగా.. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.

Updated Date - May 05 , 2026 | 04:04 AM