మండిన రాయలసీమ, కోస్తా
ABN , Publish Date - Apr 27 , 2026 | 06:09 AM
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఎండ, వడగాడ్పుల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అతున్నాయి. రోజుల తరబడిగా వేడివాతావరణం నెలకొనడంతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు.
అనంతపురంలో 44.8 డిగ్రీలు
198 మండలాల్లో 41డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఎండ, వడగాడ్పుల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అతున్నాయి. రోజుల తరబడిగా వేడివాతావరణం నెలకొనడంతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఆదివారం ఉదయం నుంచే సూర్యుడి ప్రతాపానికి రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాలు నిప్పులకొలిమిలా మారాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 44.8, మార్కాపురం జిల్లా కంభంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 16 జిల్లాల్లోని 198 మండలాల్లో 41డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదైంది. వాయువ్య గాలులతో వడగాడ్పులు తీవ్రత కొనసాగిందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా సోమవారం నుంచి 29 వరకు కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని 23 మండలాల్లో తీవ్రంగా, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, మార్కాపురం, కడప జిల్లాల్లోని 26 మండలాల్లో సోమవారం వడగాడ్పులు ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.