ఉత్తర కోస్తాలో వాన.. సీమలో ఎండ
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:15 AM
కొద్దిరోజులుగా కొనసాగుతున్న వేడి వాతావరణం, సము ద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది.
రేపటి నుంచి నాలుగు రోజులు వర్షాలు
అమరావతి/విశాఖపట్నం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): కొద్దిరోజులుగా కొనసాగుతున్న వేడి వాతావరణం, సము ద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో ఆదివారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 32.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఎక్కువచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. అనంతపురంలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో వర్షా లు కురుస్తాయని, మంగళవారం నుంచి కోస్తా, రాయలసీమలో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 19వ తేదీన కోస్తా, రాయలసీమల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువచోట్ల పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నేడు పిడుగులతో వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఓ వైపు ఎండలు, మరో వైపు మేఘావృతమై రానున్న మూడు రోజులు విభిన్న వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి గాలులు, ద్రోణి ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పలు చోట్ల, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.