నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన
ABN , Publish Date - May 05 , 2026 | 05:44 AM
కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరుగా రెండు ద్రోణుల ప్రభావంతో మూడు నాలుగు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది.
పెదపారుపూడిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత
అమరావతి, విశాఖపట్నం, మే 4(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరుగా రెండు ద్రోణుల ప్రభావంతో మూడు నాలుగు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. సోమవారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఎక్కువచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. 16 జిల్లాల్లోని 74 మండలాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 43.9, విజయవాడ తూర్పులో 43.1, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణి ప్రభావంతో మంగళవారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉంటాయని తెలిపింది.