మండిన ఉత్తర కోస్తా
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:56 AM
ఉత్తర కోస్తా బుధవారం ఎండ తీవ్రత, వడగాడ్పులతో మండిపోయింది. ఉదయం నుంచి వేడి వాతావరణం మొ దలై మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిలామారింది.
మరో మూడు రోజులు ఇదే పరిస్థితి
మాకవరపాలెంలో 44.3 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఉత్తర కోస్తా బుధవారం ఎండ తీవ్రత, వడగాడ్పులతో మండిపోయింది. ఉదయం నుంచి వేడి వాతావరణం మొ దలై మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిలామారింది. వేడి గాలులకు ప్రజలు ఠారెత్తిపోయారు. ఉత్తరకోస్తాలో 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. అనకాపల్లి జిల్లా మా కవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 44.2, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత, సముద్రం నుంచి వీచిన తేమగాలులకు మధ్యా హ్నం తరువాత వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5, లావేరులో 64.5 మి.మీ.వర్షపాతం నమోదైంది. గురువారం కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని, ఎండ తీవ్రత కొనసాగుతుందని, కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు ఓ వైపు ఎండ ప్రభావం, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5, లావేరులో 64.5, మన్యం జిల్లా పాచిపెంటలో 48, అనకాపల్లి జిల్లా రావికమతంలో 29, ఎస్ రాయవరంలో 28.5, విశాఖ జిల్లా పెందుర్తిలో 28 మిల్లీమీటర్ల వాన పడింది.