నెల్లూరు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:53 AM
నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
సంగం, మే 31(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని, ఉరుములు, మెరుపులతో మర్రిపాడు, జంగాలకండ్రిక గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కొన్ని గ్రామాల్లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. చెన్నవరప్పాడులో రైతు కూలి ఉన్నం వెంకటేశ్వర్లు ఇంటి రేకులు లేచిపోయాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈదురు గాలులులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి, జలదంకి మండలాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసింది. వింజమూరులో గాలులకు ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. కొండాపురం మండలం మక్కెనవారిపాలెంలో దామా రాజశేఖర్ గేదెలను ఇంటికి తోలుకెళుతుండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో 11 కేవీ లైను తీగ తెగి పడటంతో గేదె అక్కడికక్కడే చనిపోయింది.