12, 13 తేదీల్లో అల్పపీడనం
ABN , Publish Date - May 09 , 2026 | 04:10 AM
దక్షిణ శ్రీలంక పరిసరాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం నుంచి తేమగాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపు వీస్తున్నాయి.
వాయుగుండంగా బలపడుతుందని అంచనా
17 తర్వాత అండమాన్‌కు రుతుపవనాలు
విశాఖపట్నం, అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): దక్షిణ శ్రీలంక పరిసరాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం నుంచి తేమగాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈ నెల 12 లేదా 13న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ తెలిపింది. ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితం ఇస్రో వాతావరణ నిపుణుడూ వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత 2-3 రోజుల్లో వాయుగుండగా బలపడుతుందని అంచనా వేశారు. తుఫాన్‌గా మారుతుందో లేదో 2-3 రోజుల తరువాత స్పష్టత వస్తుందని స్కైమెట్ తెలిపింది. ఇదిలావుండగా ఈ నెల 16, 17 తేదీల్లో బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో భారీవర్షాలు కురుస్తాయని, వాటి ప్రభావంతో అదే సమయంలో దక్షిణ అండమాన్, దక్షిణ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని స్కైమెట్ తెలిపింది. 18-20 తేదీల మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని, రుతుపవనాలు దక్షిణ అండమాన్ పరిసరాల్లో ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఈ నెల 14వ తేదీ తరువాత కేరళ, తమిళనాడుల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా కొమొరిన్ తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
మరో మూడు రోజులు వర్షాలు
రాష్ట్రంలో ఓ వైపు ఎండ, మరోవైపు వాన జల్లులతో విభిన్న వాతావరణం నెలకుంది. ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు మేఘావృతమై, అకాల వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 15 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. శుక్రవారం కడపలో 40.8, నంద్యాల జిల్లా పాణ్యంలో 40.7, పోలవరం జిల్లా వీఆర్‌పురంలో 40.6, పల్నాడు జిల్లా గురజాలలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం?
ఇక, ఈ ఏడాది రుతుపవన సీజన్ (జూన్-సెప్టెంబరు)లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 92 శాతంగా ఉంటుందని ఐఎండీ ఇంతకు ముందటి అంచనాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాన పంటల నాట్లు వేసే కాలంలో పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం వినియోగం, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.