రుతుపవనాలు ఆలస్యం
ABN , Publish Date - May 26 , 2026 | 04:50 AM
దేశంలోకి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల...
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): దేశంలోకి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ నెల 31-జూన్ 2 మధ్య కేరళను తాకే అవకాశముందని వెల్లడించింది. అయితే, వడగాలుల ప్రభావం మరింత పెరిగితే రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావచ్చని పేర్కొంది. తెలంగాణకు జూన్ రెండోవారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే, రుతుపవనాల రాకకు ముందే కేరళలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం ప్రకటించింది. ఎండలతో మండిపోతున్న ఉత్తరభారతానికి ఐఎండీ మరో హెచ్చరిక జారీచేసింది. పశ్చిమ అలజడుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడతాయని తెలిపింది. ఆయా రాష్ట్రాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది.