బలపడిన అల్పపీడనం
ABN , Publish Date - Jul 05 , 2026 | 06:12 AM
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలపడి శనివారం తీవ్ర అల్పపీడనంగా మారింది.
నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. 8 వరకు వానలు: ఐఎండీ
విశాఖపట్నం, అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలపడి శనివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి నైరుతి వైపు వాలి ఉంది. తీవ్ర అల్పపీడనం రానున్న మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా పప్పల లింగాలవలసలో 4.1, మన్యం జిల్లా సీతానగరంలో 3.09, దత్తిరాజేరులో 2.92, మక్కువలో 2.62, పురోహితునివలసలో 2.6, పాచిపెంటలో 2.45, శ్రీకాకుళం జిల్లా జీ సిగడాంలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా,సీమల్లో పలుచోట్ల వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్క డ భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.