బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:28 AM
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని గురువారం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారానికి బలపడి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది.
రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా..!
నేటి నుంచి ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
7 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు
విశాఖపట్నం, అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని గురువారం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారానికి బలపడి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఇది రానున్న రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాలో చిరుజల్లులు పడ్డాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల పొడి వాతావరణం నెలకొని పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు, దక్షిణ కోస్తా, సీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఈనెల 7 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. శనివారం అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.