Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:34 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

  • ఉత్తర కోస్తాలో 3 రోజులు భారీ వర్షాలు

  • దక్షిణ కోస్తా, రాయలసీమకూ వర్ష సూచన

  • మత్స్యకారులు సంద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక

విశాఖపట్నం, అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయం నుంచి ఉత్తర కోస్తాలో మేఘాలు ఆవరించి అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. శుక్రవారం నుంచి ఈ ఆదివారం వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురవనున్నాయి. కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. అల్పపీడనం బలపడి మధ్య భారతం వైపు పయనించిన తర్వాత కోస్తాలో ఎండ తీవ్రత పెరుగుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. కాగా, గుజరాత్‌ నుంచి కర్ణాటక వరకు అరేబియా సము ద్ర తీరం పొడవునా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పశ్చిమ భారతంలో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.


ఇంకా రుతుపవనాలు ఢిల్లీ సహా వాయవ్య భారతంలో అనేక ప్రాంతాలకు గురువారం విస్తరించాయి. అల్పపీడనం బలపడి మధ్య భారతం మీదుగా పయనించే క్రమంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, విదర్భ, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లో వర్షాలు పెరగనున్నాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇదిలాఉండగా గడచిన 40 రోజులుగా మేడిన్‌ జూలియన్‌ అస్లేషన్‌(ఎంజేవో) ప్రతికూల దశలో ఉన్నందున హిందూ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. దీంతో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జూన్‌లో దేశంలో సాధారణం కంటే 40 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. అయితే ఎంజేవో ఆరో దశలోకి ప్రవేశించడంతో ఈనెల తొలివారంలో దేశంలో రుతుపవనాలు చురుగ్గా మారి అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశ్లేషించారు. అయితే, వచ్చే వారం చివరి నాటికి ఎంజేవో ఏడో దశకు చేరడం, ఎల్‌నినో బలపడే అవకాశం ఉన్నందున రుతుపవనాలు కొంత వరకు మందగిస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 05:34 AM