కర్నూలులో 37 డిగ్రీలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:08 AM
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతుండంతో ఎండ ప్రభావం నెలకొంది.
విశాఖపట్నం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతుండంతో ఎండ ప్రభావం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా, మరికొన్నిచోట్ల ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువ లేదా తక్కువగా నమోదయ్యాయి.
కోస్తా, సీమలో వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఆదివారం ఉదయానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి సాయంత్రానికి ఈశాన్యంగా దిశ మార్చుకుంది. రానున్న 36 గంటల్లో ఈశాన్య దిశలో పయనించి మధ్య బంగాళాఖాతం దిశగా వెళ్లనున్నది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.