వాతావరణ అనిశ్చితితో కోస్తాలో వర్షాలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:33 AM
గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దక్షిణ కర్ణాటక పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.
కర్నూలులో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
విశాఖపట్నం/అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దక్షిణ కర్ణాటక పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. అలాగే, రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. వీటి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఆదివారం కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. పోలవరం జిల్లా అడ్డతీగలలో 27, ఏలూరు జిల్లా రేచర్లలో 21.5, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని పేర్కొంది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది.