Share News

రాకాసి మేఘాలు అబద్ధం!

ABN , Publish Date - May 20 , 2026 | 06:18 AM

భారతదేశంపై సుమారు మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రాకాసి మేఘాలు ఆవరించాయని, పెనుగాలులతో గంటల వ్యవధిలో కుంభవృష్టిగా వర్షం(200 నుంచి 300 మి.మీ.) కురుస్తుందని..

రాకాసి మేఘాలు అబద్ధం!

  • ఆ పోస్టులను నమ్మొద్దు: వాతావరణ నిపుణులు

  • ఐఎండీ వెబ్‌సైట్లను పరిశీలించాలని సూచన

విశాఖపట్నం, మే 19(ఆంధ్రజ్యోతి): భారతదేశంపై సుమారు మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రాకాసి మేఘాలు ఆవరించాయని, పెనుగాలులతో గంటల వ్యవధిలో కుంభవృష్టిగా వర్షం(200 నుంచి 300 మి.మీ.) కురుస్తుందని రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో పోస్టులు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం, ఇతర వాతావరణ సంస్థలకు ప్రజలు ఫోన్‌ చేసి ఆరా తీస్తుండటంతో నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అవి వదంతులంటూ కొందరు వెదర్‌మ్యాన్లు తోసిపుచ్చినా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం ఆగడంలేదు. దీనికితోడు దేశ తూర్పు, ఈశాన్య భారతంలో భారీ మేఘాలతో కూడిన తుఫాన్‌ తాకనున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చెప్పినట్టు మరో కథనాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ర్టాలకు ఈ మేఘాలతో అధిక ప్రమాదం ఉందని, రైతులు చేతికొచ్చిన పంటను భద్రపరుచుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఇటువంటి వదంతులను నమ్మొద్దని విజయవాడలోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అసోసియేట్‌ ఆచార్యుడు డాక్టర్‌ డీసీహెచ్‌ సత్యనారాయణ స్పష్టంచేశారు. మేఘాల తీవ్రతపై ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకవేళ భారీ మేఘాలు సంభవించే అవకాశం ఉంటే ఐఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుంటాయని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారు ఐఎండీ వెబ్‌సైట్లను పరిశీలించాలని కోరారు.

Updated Date - May 20 , 2026 | 06:48 AM