Share News

Weather: పెరిగిన చలి

ABN , Publish Date - Jan 15 , 2026 | 03:35 AM

ఉత్తర, మధ్య భారతంలో వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి స్వల్పంగా పెరిగింది.

Weather: పెరిగిన చలి

  • మంచులో వాహనాల రాకపోకలకు అంతరాయం

  • తిరుపతిలో పలు విమానాలు ఆలస్యం

విశాఖపట్నం/రేణిగుంట, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఉత్తర, మధ్య భారతంలో వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి స్వల్పంగా పెరిగింది. దీనికితోడు అనేకచోట్ల దట్టంగా మంచు కురిసింది. దీంతో ఉదయం పూట వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని, అనేకచోట్ల మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొగమంచు కారణంగా తిరుపతి విమానాశ్రయానికి బుధవారం పలు విమానాలు ఆలస్యంగా వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి ఉదయం 7.15 గంటలకు రావాల్సిన ఎయిర్‌ అలయన్స్‌ విమానం 8.10 గంటలకు వచ్చి, 9గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరింది. హైదరాబాద్‌ నుంచి ఉదయం 7.40 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం గంట ఆలస్యంగా వచ్చింది. 9.30 గంటలకు తిరుగు ప్రయాణమైంది. సాయంత్రం ముంబై నుంచి తిరుపతి మీదుగా హైదరాబాద్‌, అలాగే బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా విజయవాడకు ప్రయాణించాల్సిన ఇండిగో విమానాలు 40 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.


మంచు దుప్పట్లో విజయవాడ....

భోగి పండుగ రోజు ఉదయాన్నే విజయవాడను పొగమంచు కమ్మేసింది. ఉదయం ఎనిమిది గంటలైనా దట్టంగా అలుముకున్న మంచు నగరాన్ని వీడలేదు. బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌, కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాల్లో దృశ్యాలివి..

Updated Date - Jan 15 , 2026 | 03:35 AM