వర్షాలు తక్కువే!
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:10 AM
దేశంలో వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం చూపనుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు కొనసాగే నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అనేక ప్రాంతాల్లో...
నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఎల్‌నినో ప్రభావం
దీర్ఘకాలిక సగటులో 92శాతం వర్షపాతానికి అవకాశం
ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వానలు
రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ అంచనా
విశాఖపట్నం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం చూపనుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు కొనసాగే నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. దీర్ఘకాలిక సగటులో 92 శాతం (అటుఇటు 5 శాతం హెచ్చుతగ్గులు పరిగణనలోకి తీసుకోవాలి) వర్షపాతమే నమోదుకానుంది. గత 50 ఏళ్లలో (1971 నుంచి 2020 వరకూ) కురిసిన వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని లెక్కించిన దీర్ఘకాలిక సగటు 87(868.6 మి.మీ.) సెంటీమీట ర్లు. దీనిలో 92 శాతం అంటే 81 లేదా 82 సె.మీ. వర్షపాతం నమోదుకానుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా.. ఈశాన్య, దక్షిణ, ఉత్తర భారతాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా వర్షాలు కురవనున్నాయి. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్రల్లోని కొన్ని భాగాలు, మధ్య కోస్తా జిల్లాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురుస్తా యి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మొదటి అంచనా నివేదిక సోమవారం విడుదల చేసింది. సీజన్‌లో సాధారణం కంటే 6 శాతం తక్కువ వర్షపాతం కురుస్తుందని గతవారం ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ నివేదిక ఇచ్చింది. దానికంటే ఇంకా 2 శాతం తక్కువ అంటే 92 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ నివేదిక విడుదల చేసింది.
అనేకచోట్ల కరవు పరిస్థితులు..!
తాజా అంచనా నివేదికలో ఐఎండీ పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. జూన్ 1న కేరళలో ప్రవేశించే రుతుపవనాలు సెప్టెంబరు మూడో వారంలో వాయవ్య భారతం నుంచి నిష్క్రమిస్తాయి. దీర్ఘకాలిక సగటు ప్రకారం ఈ సీజన్‌లో 87 సె.మీ. వర్షపాతం కురవాలి. 96 నుంచి 104 శాతం వర్షపాతం కురిస్తే సాధారణ వర్షపాతంగా, అంతకంటే ఎక్కువ కురిస్తే అధిక వర్షపాతంగా పరిగణిస్తారు. ఒకవేళ 96 శాతం కంటే తక్కువ కురిస్తే అప్పుడు సాధారణం కంటే తక్కువ అని చెబుతారు. అయితే ఈ సీజన్‌లో దీర్ఘకాలిక సగటు 87 సె.మీ.లలో 8 శాతం తక్కువగా అంటే 92 శాతం వర్షపాతం నమోదవుతుంది. గత రెండేళ్లపాటు సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం కురవగా ఈ ఏడాది మాత్రం అంతకంటే తక్కువగా కురుస్తుందని ఐఎండీ అంచనా వేసింది. కోర్ మాన్‌సూన్ ప్రాంతంగా పిలిచే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో సాధారణం కంటే తక్కువగాను, దక్షిణాదిలో తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో సాధారణం లేదా కొన్నిచోట్ల ఎక్కువగా, మరికొన్నిచోట్ల తక్కువగా నమోదుకానుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవనుంది. దీంతో దేశంలో అనేకచోట్ల కరవు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు
రాష్ట్రంలో కర్నూలు, నంద్యాలలో సాధారణం కంటే ఎక్కువగానూ.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణం గా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మధ్య కోస్తాలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మొత్తం, ప్రకాశంలో కొంతభాగంలో సాధారణం కంటే ఎక్కువగా, ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళంలో దాదాపు సగం ప్రాం తం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని భాగాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని సూచించింది.
జూన్ వరకు లానినా తటస్థ పరిస్థితులు
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న లానినా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ వరకు ఈ పరిస్థితులు కొనసాగి, ఆ తర్వాత ఎల్‌నినో ప్రారంభమవుతుందని అంచనా. రుతుపవనాల సీజన్ చివరి నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉంది. అయితే హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) రుతుపవనాల సీజన్ ముగిసే నాటికి అనుకూలంగా (పాజిటివ్) మారే అవకాశం ఉంది. పాజిటివ్ ఐవోడీ వర్షపాతానికి అనుకూలం. గత మూడు నెలల్లో ఉత్తరార్ధ గోళంలో మంచు సాధారణం కంటే తక్కువగా కురిసింది. ఉత్తరార్ధ గోళం, యురేషియాపై మంచు కవచం తక్కువగా ఉండడం వంటివి నైరుతి రుతుపవనాల సీజన్‌కు సానుకూలమని ఐఎండీ పేర్కొంది.