Share News

28 వరకు తీవ్ర వడగాడ్పులు

ABN , Publish Date - May 24 , 2026 | 05:17 AM

దేశంలో ఈ నెల 28 వరకు తీవ్ర వడగాడ్పులు కొనసాగనున్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లతోపాటు ఏపీ, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల్లో..

28 వరకు తీవ్ర వడగాడ్పులు

  • ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ, మే 23: దేశంలో ఈ నెల 28 వరకు తీవ్ర వడగాడ్పులు కొనసాగనున్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లతోపాటు ఏపీ, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం వరకు తీవ్ర వడగాడ్పులు ఉంటాయని తెలిపింది. పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, ఢిల్లీల్లో గురువారం వరకు వడగాడ్పులు ఉంటాయని, ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నుంచి బుధవారం వరకు తీవ్ర వడగాడ్పులు ఉంటాయని పేర్కొంది. తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిసా, ఛత్తీస్‌గఢ్లలోనూ మరికొన్ని రోజులు వడగాడ్పులు కొనసాగనున్నట్టు పేర్కొంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లోని గంగాతీర ప్రాంతాల్లో వేడి, తేమ వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ఆదివారం నుంచి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించింది.

వర్ష సూచన..

ఈనెల 28 వరకు ఉత్తర, మధ్యభారతంలోని ఎక్కువ ప్రాంతాల్లో తీవ్ర వేడి కొనసాగుతుందని, ఈశాన్య, తూర్పు, దక్షిణ భారతంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈనెల 25వరకు అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో అతిభారీ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపురల్లో విస్తృతంగా వర్షాలు కరుస్తాయని పేర్కొంది. కేరళ, లక్షద్వీప్‌, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలతోపాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 28 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్‌, సిక్కింలలో ఈనెల 26 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిసాల్లో వారం వరకు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - May 24 , 2026 | 05:18 AM