మరో 4 రోజులు ఎండలే.. నేడు వడగాల్పులు
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:06 AM
వర్షాకాలంలో మళ్లీ ఎండాకాలం వచ్చేసింది. రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రత బాగా పెరిగింది. మే నెలను తలపించేలా పలు జిల్లాల్లో...
నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలంలో మళ్లీ ఎండాకాలం వచ్చేసింది. రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రత బాగా పెరిగింది. మే నెలను తలపించేలా పలు జిల్లాల్లో 42-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 43 డిగ్రీలు, హైదరాబాద్‌లో 37-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. దీనికితోడు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. ఈ పరిస్థితి ఈనెల 20వరకు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రానికి వచ్చిన నైరుతి రుతుపవనాలు ఎల్‌నినో ప్రభావం కారణంగా బలహీనపడి ముందుకు సాగడం లేదు. ఇంకా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు విస్తరించలేదు. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది.