ఉడికిన రాష్ట్రం
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:24 AM
ఠారెత్తించిన ఎండతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉడికిపోయాయి. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలులతో రాయలసీమ, కోస్తాలో ఎక్కువ ప్రాంతాలు ఆదివారం నిప్పులకొలిమిలా మారాయి.
ఠారెత్తించిన ఎండతో ఉక్కిరిబిక్కిరి
పొట్టిపాడులో 43.8 డిగ్రీలు
నేడు 100 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం
అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఠారెత్తించిన ఎండతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉడికిపోయాయి. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలులతో రాయలసీమ, కోస్తాలో ఎక్కువ ప్రాంతాలు ఆదివారం నిప్పులకొలిమిలా మారాయి. కోస్తా మారుమూల ప్రాంతాలు, రాయలసీమలో తేమ తగ్గడం, సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడంతో ఎండతీవ్రత పెరిగింది. ఆదివారం కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితితో కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కూడా కురిసింది. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, సీమలో వేడి వాతావరణం కొనసాగుతుందని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లోని 51 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు.. వీటితో పాటు కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 49 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని తెలిపింది. ఈ నెల 17 వరకు కోస్తా, సీమలో ఎండలు కొనసాగుతాయని, ఆ తరువాత పగటి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయని నిపుణుడొకరు తెలిపారు.