Share News

నెలాఖరు వరకు ఎండలే!

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:21 AM

ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

నెలాఖరు వరకు ఎండలే!

  • ద్వితీయార్ధంలో మరింతగా..

  • వచ్చే వారం ఉత్తరకోస్తాలో వడగాడ్పులు

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత నెలాఖరు వరకు ఇదేవిధంగా కొనసాగనున్నది. రాయలసీమలో కూడా ఎండలు మండనున్నాయి. వచ్చే వారం ఉత్తరకోస్తాలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయని భారత వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన రెండు వారాల నివేదికలో పేర్కొంది. గురువారం నుంచి ప్రారంభమైన వారంలో రాయలసీమ, దక్షిణ కోస్తా కంటే ఉత్తర కోస్తాలో వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈనెల తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న రెండో వారంలో ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించింది. ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. కాగా ఈ నెల మూడు, నాలుగు వారాల్లో రాష్ట్రంలో ఎండలు ఇంకా పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని మధ్యాహ్నం నుంచి పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.


నేడు కోస్తాలో వడగాడ్పులు

రాష్ట్రంలో ఎండ తీవ్రతతోపాటు వడగాడ్పుల ఉధృతి పెరుగుతోంది. శనివారం కోస్తా జిల్లాల్లోని 90 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 73 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాల్లోని 17 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. కాగా శుక్రవారం మన్యం జిల్లా భామినిలో 41.8, చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9, శ్రీకాకుళం జిల్లా జీ సిగడంలో 40.5, నంద్యాల జిల్లా ఆలమూరు, కడప జిల్లా బద్వేల్‌లో 40.4డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 04 , 2026 | 04:22 AM