మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:03 AM
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రతతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 11 గంటలకే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి...
నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.4 డిగ్రీలు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రతతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 11 గంటలకే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం పలుచోట్ల ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదైంది. కోనసముందర్, పోతంగల్, మోర్తాడ్‌లో 44.3, పెర్కిట్, వేల్పూర్, గూపన్‌పల్లి, మల్కాపూర్, తూంపల్లి, మోస్రాలో 44.2 డిగ్రీలు రికార్డయింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో 44.3, మల్లాపూర్ మండల కేంద్రం, ధర్మపురి మండలం జైనాలో 44.1, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కాపూర్‌లో 44.2, హాజీపూర్ మండలం ర్యాలీ, నస్పూర్, పాత మంచిర్యాల, జైపూర్ మండలం కుందారంతో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లో 43 డిగ్రీలు దాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన మాదినేని ఆరోగ్యబాబు (57), నల్లగొండ జిల్లా పావురాలగూడెం గ్రామానికి చెందిన నిమ్మల యాదయ్య (56) అనే వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతిచెందారు.