Share News

భగ్గుమన్న రాష్ట్రం..!

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:34 AM

ఎండ తీవ్రతతో రాష్ట్రం భగ్గుమంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 67 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేక జిల్లాల్లో వడగాడ్పులు వీచాయి.

భగ్గుమన్న రాష్ట్రం..!

  • 67 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రతతో రాష్ట్రం భగ్గుమంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 67 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేక జిల్లాల్లో వడగాడ్పులు వీచాయి. విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్‌ ప్రకారం.. 22 జిల్లాల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. కడప, మార్కాపురం, నంద్యాల, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని 67 మండలాల్లో 41 డిగ్రీలు దాటాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 43.6, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 42.9, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.8, ఎన్టీఆర్‌ జిల్లా మోగులూరులో 42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాడ్పులు, దక్షిణ కోస్తా, సీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈనెల 16వ తేదీ వరకు రాష్ట్రంలో అనేకచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. కాగా, శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Apr 11 , 2026 | 03:34 AM